హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి జర్నలిస్ట్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డికి బట్టలు ఊడదీసే ఫాంటసీ ఏంటో అర్థం కావడంలేదని చురకలంటించారు. అది చట్టసభలో ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా అని నిలదీశారు. ప్రజలు మీ బట్టలు విప్పేందుకు రెడీ అయితున్నారు. ముందు దానిమీద దృష్టి పెట్టండి అని హితవు పలికారు. బీజేఎల్పీ కార్యాలయంలో మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తున్నారని విమర్శించారు. ఇది హామీల ఎగవేతల, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. తాను గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పకుండా దాటవేశారని, పసలేని జవాబులు చెప్పారని తీవ్రంగా మండిపడ్డారు.