హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వ, మంత్రుల అవినీతిని రెండ్రోజుల్లో బయటపెడతానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందని, గతేడాది ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసిందని చెప్పారు. కొత్త ఏడాదిలో అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 28న రైతు కూలీలకు రూ.12వేలు వేస్తామని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని గుర్తు చేశారు. గడువు ముగిసినా డబ్బులు వేయకుండా ఆయనను అడ్డుకున్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా? అని ప్రశ్నించారు. శనివారం జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ఎప్పటిలోగా ఇస్తారో తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,38,117 కోట్ల అప్పు తెచ్చిందని స్పష్టం చేశారు. ఇందులో రూ.20 వేల కోట్లను రుణమాఫీకి వాడి, మిగతా రూ.1.18 లక్షల కోట్లను బడా కాంట్రాక్టర్లకు చెల్లించారని తెలిపారు. కమీషన్ల కోసం సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారా? అని విమర్శించారు.