పెద్దపల్లి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామగుండంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ ముఖ్యనేత, కార్మికవర్గాల్లో పట్టున్న నాయకుడు కౌశికహరి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన రామగుండం దశాబ్ది ప్రగతి సభలో తన సతీమణి, రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ కార్పొరేట్ కౌశిక లతతో కలిసి ఆయన మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారితోపాటు కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ చైర్మన్, 41వ డివిజన్ కార్పొరేటర్ గాదం విజయ, ఆ పార్టీ 50 డివిజన్ల అధ్యక్షులు, కమిటీ సభ్యులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కౌశికహరి 2009 సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 1,200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి తృతీయ స్థానంలో నిలిచారు. కౌశికహరి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘానికి, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘానికి నాయకత్వం వహిస్తున్నారు.