BJP | మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 5: ఆయన ఓ జాతీయ పార్టీ అనుబంధ సంఘానికి జిల్లా అధ్యక్షుడు. పొద్దున లేస్తే ప్రజలకు నీతిబోధలు చెప్పే నాయకుడు. ఆ నాయకుడే నిత్యం తన భార్యను వేధిస్తూ.. అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పం పించాడు. కాపురానికి తీసుకెళ్లాలని భార్య కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆయనే బీజేపీ సైనిక విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా మద్దూరు మం డలం నర్సాయపల్లికి చెందిన బద్దిపడగ శ్రీనివాస్‌రెడ్డి. తనను కాపురానికి తీసుకెళ్లకుండా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ భార్య అంజలి బుధవారం తన ఏడాది కొడుకుతో కలిసి అత్తింటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగింది. ఆమె ఆందోళనకు మహిళలు సంఘీభావం ప్రకటించారు. అంజలికి న్యాయం జరిగే వరకు ఆమెతో కలిసి పోరాడుతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. బద్దిపడగ శ్రీనివాస్‌రెడ్డితో తనకు 2019లో వివాహం జరిగిందని, పెండ్లయిన వారం రోజుల నుంచే అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడని వాపోయింది. వేధింపులు తాళలేక సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో 2020 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశానని, పోలీసులు సఖీ కేంద్రానికి తమ ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ చేసినా అతనిలో మార్పు రాలేదని వివరించింది. ‘బాబు నాకు పుట్టలేదని, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని, విడాకులు ఇస్తానని’ బెదిరిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి తనపై దాడికి దిగాడని అంజలి కన్నీరుమున్నీరైంది. తనను కాపురానికి తీసుకెళ్లే వరకు ఇంటి ముందే బైఠాయిస్తానని తెలిపింది.