గీసుగొండ, డిసెంబర్ 13 : అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో రాజన్న కోడెల విక్రయ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని, దీనిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని బీజేపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కాళీప్రసాద్‌రావు, రాష్ట్ర నాయకుడు విజయచందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ ధర్మారం శివారులో బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి సురేఖ సిఫారసు మేరకు ఆలయ అధికారులు 66 కోడెలను రాంబాబు, మందస్వామి, పసునూటి శ్యామ్సుందర్కు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో బయటపడిందని చెప్పారు.
దీనికి దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ అధికారులు నిబంధనలను పాతరేసి, కాసులకు కక్కుర్తి పడి ఓ వ్యక్తికి 66 కోడెలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి స్పందించాలని కోరారు. వేములవాడ ఈవోను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పును ఒప్పుకోకుండా ఆ విషయాలను వెలుగులోకి తెచ్చిన పత్రికలపై కేసులు పెడతామని బెదిరించడం ఆమె అహంకారానికి నిదర్శనమని చెప్పారు. ఈ విషయంపై గీసుగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు.