హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఘోరంగా విఫలమైందని బీజేపీ నేత, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ వివర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకలో ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని చెప్పారు.
అమలుసాధ్యం కాని హామీలు ఇచ్చి, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటించిన ఐదుగ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందన్నారు. ‘నో డెవలప్మెంట్, నో గవర్నెన్స్’ మాడల్‌ను అమలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు. వాళ్లు చెప్పిన గ్యారెంటీలు, పనులకు నాలుగునెలల్లో కనీసం పదిశాతం నిధులు కూడా విడుదల చేయలేదని తెలిపారు.
అన్నభాగ్య పథకం కింద పదికిలోల బియ్యం అన్నారని, కానీ ఐదు కిలోలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. శక్తి కార్యక్రమం కింద మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారని, ఉచిత ప్రయాణానికి సహకరిస్తున్న ఆర్టీసీకి నిధులు విడుదల చేయలేదని అన్నారు. పైగా బస్సుల సంఖ్యను తగ్గించారని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఒకప్పుడు మిగులు విద్యుత్తు ఉన్న కర్ణాటకలో ఇప్పుడు విద్యుత్తు కోతలు పడుతున్నాయని చెప్పారు. అలాంటి విఫల కర్ణాటక మాడల్‌ను చూపు తూ.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.