Bandi Sanjay | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రివర్గం లో, బీజేపీలో భారీగా మార్పులు, చేర్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తున్న ది. ప్రధాని మోదీ నేతృత్వంలోని 3.0 పాలన జూన్‌తో రెండేండ్లు పూర్తి చేసుకోనున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వపరం గా, పార్టీ పరంగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైనట్టు ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో బండి భగీరథ్ వ్యవహారం బయటికి రావ డం, పోక్సో కేసు నమోదు కావడంతో కేంద్ర మంత్రివర్గం నుంచి అతడి తండ్రిని తప్పించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన స్థానంలో తెలంగాణకే చెందిన బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బండి భగీరథ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు నివేదించినట్టు తెలిసింది.
నిబంధనల ప్రకారం కేంద్ర క్యాబినెట్లో 81 మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉన్నది. మోదీ సహా కేంద్ర మంత్రిమండలిలో 72 మంది ఉన్నారు. మరో 9 మందికి అవకాశం ఇవ్వవచ్చు. కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముందుగా భావించారట. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్నబీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేయలేదు. ఒకేసారి మంత్రి మండలి, జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తద్వారా పార్టీ నుంచి ప్రభుత్వంలోకి, ప్రభుత్వం నుంచి పార్టీలోకి నేతల మార్పులు, చేర్పులు చేయడం సులభం అవుతుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నదట. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ర్టాలు, 2029 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ విస్తరణ కంటే పునర్వ్యవస్థీకరణ చేయడమే మేలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకూ ప్రాధాన్యం కల్పించాలని మోదీ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులు చేయనున్నారని, ఇప్పటికే 71 మంత్రులకు సంబంధించిన పనితీరు నివేదికతోపాటు, సెల్ఫ్ అప్రైజల్ అడిగినట్టు సమాచారం. ఈ నెలాఖరులో లేదా జూన్‌లో పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెప్తున్నారు.
తెలంగాణలో కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో ఇరుక్కోవడం బీజేపీని ఇరకాటంలో పెట్టినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి బండి భగీరథ్ తప్పించుకొని తిరగడం, పోలీసులు నోటీసులు పంపడం, రాష్ట్రంలో పెల్లుబికిన ప్రజాగ్రహం, సిట్ నియామకం, హనీట్రాప్ కేసు నమోదు చేయడం, మారిన రాజకీయ పరిణామాలు ఇలా సమగ్రంగా కేంద్ర హోం శాఖ మంత్రికి గవర్నర్ నివేదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర మంత్రికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నదని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే పదవి నుంచి తొలగించడానికంటే ముందే తానే రాజీనామా చేసే యోచనలో కేంద్రమంత్రి ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. శనివారం ఎవరికీ అందుబాటులో ఉండకుండా తన కొడుకును పోలీసులకు అప్పగించడం, పదవికి రాజీనామా చేయడం మీదే సుదీర్ఘంగా చర్చించినట్టు పేర్కొన్నాయి. కొడుకు పోలీసుల ముందు లొంగిపోతే పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుందని, తన పదవి గురించి ఆలోచించడానికైనా, ఢిల్లీ పెద్దలతో మంతనాలకైనా కొంత వెసులుబాటు దొరుకుతుందని సన్నిహితులు సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు.