హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ల వద్ద బీజేపీ చేపట్టిన ధర్నాకు రైతుల మద్దతు కరువైంది. బీజేపీ నాయకులు, కార్యకర్తల హడావిడి తప్ప ఎక్కడా రైతులు కనిపించలేదు. దీంతో రైతులు లేని రాజకీయ ధర్నాగా మారిపోయింది. బాయిల్డ్ రైస్‌ను కొనేదిలేదని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చి, రాష్ట్ర ప్రభుత్వం మీద అభాండాలు వేసేందుకే బీజేపీ ధర్నా చేపట్టిందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతున్నది. శుక్రవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంతి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ హడావిడి చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘మీరు మా పంటను కొనరు. కొంటామని కేంద్రం నుంచి హామీ ఇప్పించరు. పైగా ధర్నా పేరుతో డ్రామాలు చేస్తారా?’ అని పలువురు రైతులు బీజేపీ వైఖరిని తూర్పారబడుతున్నారు.