ఉన్న బలం కొంచెం చూపుతున్నది అనంతం
మొత్తం రాష్ర్టాలు – 28
బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న రాష్ర్టాలు – 8
దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన రాష్ర్టాలు – 8
ప్రాంతీయ పార్టీలతో బీజేపీ అధికారం పంచుకుంటున్న రాష్ర్టాలు – 10
బీజేపీకి ఒక్క అసెంబ్లీ సీటూ లేని రాష్ర్టాలు – 2
10లోపు సీట్లు కలిగిన రాష్ర్టాలు – 8
దేశవ్యాప్తంగా బీజేపీ ఓడిన సీట్లు – 66%
(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ)హైదరాబాద్, సెప్టెంబర్ 11: సార్వత్రిక ఎన్నికలకు ముందు తారస్థాయికి చేరుకొనే భావోద్వేగాలు.. మీడియాలో హాహా హూహూలు .. అదిగదిగో దేశం కోసం ఇంద్రుడే నరేంద్రుడై దిగివచ్చాడన్న బాకాలు.. మొత్తంగా వీటన్నింటికీ ఓ ట్యాగ్‌లైన్.. ‘దేశం కోసం.. ధర్మం కోసం’.. వెరసి తెలియని ఓ అయోమయానికి గురైన ఓటరు వేసిన ఓట్లతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి.. తాము పవర్లో లేని రాష్ర్టాలను కబ్జా చేసుకోవడంపైనే దృష్టి పెట్టింది. డబ్బులతో.. దాడులతో ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనిపారేయడం.. ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను దారుణంగా కూలదోసి పవర్లోకి రావడం వంటి నీచరాజకీయాలకు తెరలేపింది. ఎనిమిదేండ్లలో 277 మంది ఎమ్మెల్యేలను కొని.. 8 రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చిందంటేనే బీజేపీ నీతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలహీనపడటం.. అంతర్గత సమస్యలతో అల్లాడిపోవడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. కానీ వీటన్నింటినీ తన బలంగా చెప్పుకొంటూ వీరలెవల్లో ప్రచారం మొదలుపెట్టింది. ఇదిగో మేం ఇన్ని చోట్ల అధికారంలో ఉన్నాం.. మా పవర్ సామాన్యమైంది కాదు.. మాకు తిరుగే లేదు. మేం చెప్పింది వేదం.. చేసేది శాసనం.. అని సామాజిక మాధ్యమాల్లో తెగ ఊదర గొడుతున్నది. ఇదంతా చూసే ప్రజలకు నిజమా అనే ఒక భ్రమ కలిగేలా చేసింది. దేశంలో జాతీయ రాజకీయ యవనికపై ప్రస్తుతం బీజేపీ రాజకీయ ముఖచిత్రమిది. వాపును చూపించి బలుపు అని చిత్త భ్రమను కల్పించే పనిలో బీజేపీ అగ్రనేతలు తెగ బిజీగా ఉన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ అంత బలంగా ఉన్నదా? ఇప్పుడు ప్రజలను, వివిధ రాజకీయ పార్టీలనూ తొలుస్తున్న ప్రశ్న ఇది. స్థూలంగా చూస్తే ఆ పార్టీకి ప్రజాబలం కంటే.. అంగబలం, అర్థబలమే ఎక్కువ అని అర్థమవుతున్నది. గత ఎనిమిదేండ్లలో బీజేపీ సొంతంగా పూర్తి మెజార్టీతో గెలిచిన రాష్ర్టాలు ఏడు కాగా.. గుజరాత్, యూపీ మినహా మిగతావన్నీ చిన్న రాష్ర్టాలే. వీటిలోనూ మూడు ఈశాన్య రాష్ర్టాలు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి.. దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకొన్నది. బీజేపీకి ప్రధానంగా కలిసొచ్చిన అంశం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలహీనపడిపోవడం. సీనియర్ నేతలు ఒక్కక్కరుగా కాంగ్రెస్‌ను వీడిపోవడం.. యువ నాయకత్వానికి అవకాశాలు రాకుండా పోవడంతో పెద్ద పెద్ద రాష్ర్టాల్లో పెచ్చరిల్లిన అసమ్మతి బీజేపీకి వరంగా మారింది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్యను బలహీనం చేసి వృద్ధనేత కమల్‌నాథ్‌కు పట్టం కట్టడం వల్ల సింధియాను తమవైపు లొంగదీసుకోవడం బీజేపీకి సులువైంది. దీంతో అంత పెద్ద రాష్ర్టాన్ని కాంగ్రెస్ చేజేతులా పొగొట్టుకొన్నది. దీనికితోడు విపక్షాల అనైక్యత కూడా విభజించి అధికారం చేజిక్కించుకోవాలనే బీజేపీ విధానానికి ఊతమిచ్చింది అయితే ఈడీ, సీబీఐలను ఉసికొల్పడం.. లేకపోతే ఎమ్మెల్యేలను కొనేయడం.. ఇలా.. ఇప్పటి వరకు 277 మంది ఎమ్మెల్యేలను దాదాపు రూ.4,500 కోట్లు పెట్టి కొన్నారన్న వార్తలు వింటుంటేనే బీజేపీ శకుని తంత్రాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ తంత్రానికి ఇప్పటివరకు ఎనిమిది రాష్ర్టాల్లో అధికారం బీజేపీ పాలైపోయింది. అధికార సామ్రాజ్య విస్తరణకు ప్రాంతీయ పార్టీలపై సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నది. అవసరమైతే న్యాయ వ్యవస్థను కూడా తన అవసరాలకు వినియోగించుకొంటున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులో ఏండ్ల తరబడి విచారణను ఎదుర్కొన్న జయలలిత అక్రమాస్తుల కేసులో.. ఆమె చనిపోయిన రెండు నెలల్లోపే తీర్పు ఇప్పించి.. ఆమె పార్టీ అన్నాడీఎంకేను పూర్తిగా బలహీనపరచిన ఘనత మోదీ సర్కారుదేనన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బహిరంగంగా వినిపిస్తున్నవే. బెంగాల్లో తృణమూల్, బీహార్‌లో ఆర్జేడీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో శివసేన.. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఆయా పార్టీలను బలహీనం చేయడానికి బీజేపే వేయని ఎత్తుగడ లేదు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ద్వయం బీజేపీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత.. పార్టీ మూల సిద్ధాంతం నేతి బీరకాయలో నెయ్యిలా తయారైంది. అద్వానీ, మురళీమనోహర్ జోషిల శకానికి మోదీ, షా చరమగీతం పాడారు. నిబద్ధత గల నఖ్వీ లాంటి ముస్లిం లీడర్లను పక్కకు తప్పించారు. పార్టీకి వెన్నెముకగా ఉన్న నితిన్ గడ్కరీని లూప్లైన్లోకి నెట్టేశారు. వెంకయ్య లాంటి సీనియర్ నాయకులను క్రియాశీల రాజకీయాలనుంచే పూర్తిగా తప్పించారు. పార్లమెంటరీ బోర్డులో పార్టీ ముఖ్యమంత్రులకు సైతం ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఇది కాకుండా అనేక క్రిమినల్ కేసుల్లో పీకలదాకా చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన హిమంత బిశ్వశర్మను పార్టీలోకి లాక్కొని అస్సాం సీఎం సీటుపై కూర్చోబెట్టారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏక్నాథ్ షిండేను శిఖండిలా వాడుకొన్నారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ను కూల్చేయడానికి బీజేపీ నేతలకు సింధియా దొరికాడు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సాధించిన సీట్లు, ఓట్లతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ఏ పక్షం వైపు లేని తటస్థ పార్టీలు సాధించిన సీట్లు, ఓట్లతో పోలిస్తే అంత పెద్దగా తేడా ఏమి లేదు. దేశంలోని రాష్ర్టాలకుగాను బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న రాష్ర్టాలు ఎనిమిది మాత్రమే. 10 రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి అధికారంలో కొనసాగుతున్నది. 6 రాష్ర్టాల్లో 10కి లోపే అసెంబ్లీ స్థానాలు కలిగి ఉండగా, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఒక్క సీటు కూడా లేదు. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, మిజోరం, మేఘాలయలలో బీజేపీకి ఉన్న అసెంబ్లీ సీట్లు రెండంకెలు కూడా దాటలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలోని 66% అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఓడిపోయింది. గుజరాత్లో కూడా ఆ పార్టీ బలం గణనీయంగా పడిపోయింది. ఈ సారి ఎన్నికల్లో గెలవడం మోదీ షాలకు జీవన్మరణ సమస్యగా మారింది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆగడాలకు, అప్రజాస్వామిక విధానాలకు చెక్ పెట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు పర్యాయాల పరాజయంతో చతికిలబడిపోయింది. టక్కుటమార విద్యలు ప్రయోగిస్తున్న మోదీ, షా వ్యూహాలకు చెక్ పెట్టగల నాయకుడు కావాలి. లోతైన అవగాహన, ఒక విజన్ కలిగి.. ఉత్తర, దక్షిణ రాష్ర్టాలను, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకరాగలిగిన సమర్థ నాయకత్వం ఉండాలి. బీజేపీ ఆటలకు ఎక్కడిక్కడే అడ్డుకట్ట వేయగలిగిన అపర చాణక్యుడు కావాలి. అలాంటి నాయకుడి కోసం దేశ ప్రజలు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ నాయకుడు ఎవరు? కాలం నిర్ణయిస్తుంది.