హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వివాదాస్పద అంశాలపై మీడియా వేదికగా పార్టీ హద్దులు మీరి వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ రాష్ట్రశాఖ నేతలను ఆదేశించింది. అనధికారికంగా మీడియా వేదికగా మాట్లాడకూడదని స్పష్టంచేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. పార్టీ నిర్ణయించిన నేతలు మాత్రమే మీడియాతో మాట్లాడాలని తేల్చిచెప్పారు.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై.. బీజేపీ నాయకురాలు మాధవీలత వరుసగా విమర్శలు చేస్తున్నారు. గతంలోనూ ఇరువురి మధ్య మాటలయుద్ధం జరిగింది. ఎంపీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలత అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకించారు. ‘హైదరాబాద్ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేయడానికి మగాళ్లు ఎవరూ లేరా..?’ అని మీడియా వేదికగానే తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అంతేకాకుండా గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజసింగ్ నుంచి మాధవీలతకు సహాయనిరాకరణ ఎదురైందని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరిగింది.