హైదరాబాద్: బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు (Ramchander Rao) పేరును ఖరారు చేసింది. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ వేయాలని పార్టీ హైకమాండ్ ఆయనను ఆదేశించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రకటించడం లాంఛనమేనన్న ప్రచారం జరిగింది. అయితే రామచందర్రావు వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గుచూపింది.
కోదాడ : రాంచందర్రావు స్వస్థలం కోదాడ మండలం నల్లబండగూడెం. ఆయన తండ్రి ఎన్వీ రాధాలక్ష్మణరావు ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో ఆచార్యుడిగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. రామచంద్ర రావు 1980-85 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకుడుగా పని చేసి.. అంచెలంచెలుగా ఎదిగారు. ఓయూ లా కళాశాల విద్యార్థి సంఘ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లిష్, హిందీలో మంచి పట్టున్న రామచంద్రరావు పట్టభద్రుల ఎమ్మెల్సీగా హైదరాబాద్ -రంగారెడ్డి- మెదక్ నియోజకవర్గాల నుంచి గెలుపొంది నిరుద్యోగ సమస్య పరిష్కానికి కృషి చేయడంతోపాటు రాష్ట్రంలోని పలు సమస్యలపై శాసనమండలిలో తన గళం వినిపించారు.
జాతీయస్థాయిలో ఎల్కే అద్వానీ, జేపీ నడ్డాతోపాటు పలువురు జాతీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఏ పదవి ఇచ్చినప్పటికీ పార్టీ నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహించడం వల్లే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ఎంపికపై కోదాడ నియోజకవర్గ బీజేపీ నేతలు కనకాల వెంకటరామయ్య, నూనె సులోచన, సంగోజు నాగచారి, వంగవీటి శ్రీనివాస్ రావు, కనగాల నారాయణ, బొలిశెట్టి కృష్ణయ్య, అక్కిరాజు యశ్వంత్ హర్షం వ్యక్తం చేశారు.