హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘చిన్న పొరపాటు 60 ఏండ్ల కింద జరిగితే తెలంగాణ ఎంత ఏడ్చింది.. మనం ఎంత బాధపడ్డం.. 58 ఏండ్లు కొట్లాడినం. ఎంతమంది సచ్చిపోయిండ్రు మన బిడ్డలు.. ఎంతమంది జైలు పాలైండ్లు.. చివరికి నేను కూడా చావ తయారై కొట్లాడితే తప్ప తెలంగాణ రాలె. అందుకే మీకు దండం పెట్టి చెప్తా ఉన్న.. మనం వేసే ఓటు జాగ్రత్తగా వెయ్యకపోతే.. ధర్మం వైపు నిలబడకపోతే.. పెట్టుబడిదారులకు మనమే సద్ది కట్టినట్లయితది. మనమే ప్రైవేటీకరణ ఒప్పుకున్నట్లయితది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం చండూరు బహిరంగ సభలో మాట్లాడుతూ, పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తయని, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలురావని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఏ ప్రధానీ చేయని దుర్మార్గపు పనులు మోదీ చేశారన్నారు. ‘మెడల పామై కరుస్తా.. 5% జీఎస్టీ వేస్తా.. ప్లేట్లకెల్లి సగం అన్నం లాక్కుంట. మీ వేలుతో మీ కన్ను పొడిపిస్త..’ అనే బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో నేతన్నలు ఆలోచించాలని కోరారు. బీజేపీకి బుద్ధి రావాలంటే చేనేత కార్మికుల కుటుంబాల నుంచి ఒక్క ఓటు కూడా ఆ పార్టీకి వేయవద్దని పిలుపునిచ్చారు. చేతిలో ఉన్న ఓటుహక్కును.. భవిష్యత్తు కోసం, మంచి చేసేవాళ్ల కోసం వినియోగించాలని కోరారు. ఇవ్వాళ వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయని, భవిష్యత్‌లో కలిసే ముందుకుపోతామన్నారు.
ఇండ్లకూ కొత్త కరెంటు మీటర్లు
దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్నదని, కానీ, ఏ రోజూ 2.10 లక్షల మెగావాట్లకు మించి సరఫరా చేయలేదని కేసీఆర్ విమర్శించారు. 75 ఏండ్ల స్వాతం త్య్రం తరువాత తెలంగాణలో తప్పా ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు అన్ని వర్గాలకు ఇస్తలేరని చెప్పారు. కేంద్రం కార్పొరేట్ల జేబులు నింపేలా అనుసరిస్తున్న ప్రైవేటీకరణ పాలసీ వల్ల ప్రజానీకం వంచనకు గురవుతున్నదని మండిపడ్డారు. సంస్కరణల ముసుగులో బావులకే కాకుండా ఇండ్లకు కూడా మీటర్లు పెట్టాలని చూస్తున్నదని, వాటిని కూడా 30 వేలు కట్టి ప్రజలే మార్చుకోవాలనే షరతులు విధిస్తున్నదని చెప్పారు. ప్రధాని ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లోనే ఈ విషయాలు ఉన్నాయని చెప్పారు. ‘ఆ సంస్కరణలను ఒప్పుకుందామా? మీటర్లు పెట్టుకొని ఉన్న కొంపలు ఆర్పుకొందామా?’ అని ప్రశ్నించారు. మీటర్లు పెడతా అన్నోనికే మీటర్లు పెడదామని పిలుపునిచ్చారు. తన బంధువులు.. బలగం.. బలం.. శక్తి అంతా ప్రజలేనని చెప్పారు.
తెలంగాణను కాటేద్దమని చూస్తుండ్రు
ఏం జరుగుతున్నదో గత కొద్ది రోజులుగా టీవీల్లో అందరూ చూస్తున్నరని కేసీఆర్ గుర్తుచేశారు. ‘కేసీఆర్ అనేటోడు గట్టిగా మాట్లాడుతుండు. వానిసంగతి చూడుండ్రి. 100 కోట్లకు ఓ ఎమ్మెల్యేను కొనుండ్రి’ అని ఢిల్లీ నుంచి బ్రోకర్లను పంపిండ్రు. 30 మంది ఎమ్మెల్యేలను కొని, కేసీఆర్‌ను పడగొట్టి.. మళ్లా తెలంగాణను కబ్జా పెట్టి ఇష్టారాజ్యంగా ప్రైవేటీకరిస్తామని చూస్తా ఉన్నరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పాలనే కుట్ర జరుగుతున్నదని ధ్వజమెత్తారు. అందుకే మీటర్లు పెట్టి, ధరలు పెంచి, పంటలు కొనక వ్యవసాయాన్ని బీజేపీ అతలాకుతలం చేస్తున్నదని, పరోక్షంగా రైతులే ఇగ వ్యవసాయం తమతోటి కాదని చాలించుకునేట్టు చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సందర్భం వచ్చినప్పుడు బుద్ధి చెప్పకుంటే, కీలెరిగి వాత పెట్టకపోతే నష్టపోయేది మనమేనని తెలిపారు.

ఆదివారం చండూరు సభా వేదికవైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అభివాదం చేస్తున్న 
వామపక్ష నేతలు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి