హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్‌శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు సీఈవోను కలిసి ఫిర్యాదు లేఖను అందజేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా దేశ సైనికులను కించపర్చేలా సీఎం రేవంత్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఇష్టారీతిన మాట్లాడారని, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను అవమానించేలా సీఎం మాట్లాడినట్టు సుదర్శన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకుంటే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయనడం ఓటర్లను బ్లాక్మెయిల్ చేయడమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.