హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో అసహనం పెరుగుతున్నది. కార్యకర్తలు, నాయకులపై ఆయన చిం దులేస్తున్నారు. ‘టీఆర్ఎస్సోళ్లు ఇల్లిల్లూ తిరుగుతున్నారు.. మన నాయకులు నా దగ్గర ‘షో’ చేస్తున్నారు’ అంటూ మునుగోడు క్యాం పు కార్యాలయంలో రుసరుసలాడారు. ‘వాడో ఫాల్తుగాడు దొరికిండు.. నాకు ప్రచారం చేయరా నాయనా అంటే ‘కేసీఆర్ పెద్దకొడుకు అయిండు అని ప్రజలకు చెప్తుండు’ అని బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌పై రాజగోపాల్‌రెడ్డి దుర్భాషలాడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆడియోలు విడుదలైన నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి మరింత అసహనంతో ఊగిపోతున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. తనకు డిపాజిట్ దక్కుతుందో లేదోనన్న అనుమానం రాజగోపాల్‌రెడ్డిని వెంటాడుతున్నదని, అందుకే ఆయన ఎవరిని పడితే వారిని చులకన చేసి మాట్లాడుతున్నారని ఒరిజినల్ బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ‘మేమేమైనా పనిలేక వచ్చామా? పార్టీ కోసం వచ్చాం’ అని సదరు బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రాజగోపాల్‌రెడ్డి వ్యవహార సరళి సరిగాలేదని ఉత్తరప్రదేశ్ నుంచి మునుగోడుకు వచ్చిన జాతీయ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘కమిట్మెంట్తో పనిచేసేవాళ్ల కష్టం కాంట్రాక్టర్లకు ఏం తెలుసు? వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి, టికెట్ ఇచ్చి, అందరూ కష్టపడుతుంటే, పనిచేసేవాళ్లను ఇంత నీచంగా చూడటం బాధనిపిస్తుంది’ అని రాజగోపాల్‌రెడ్డి తీరును బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ‘ఆయన వ్యవహారం ఏం బాగాలేదు. నువు మాత్రం పనిచేయ్’ అంటూ ఫిర్యాదు చేసిన నేతను సునీల్ బన్సల్ బుజ్జగించినట్టు తెలిసింది.
టీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతున్నది. సర్వేలన్నీ రాజగోపాల్‌రెడ్డికి మూడో స్థానమేనని సూచిస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి రోడ్‌షోలు వెలవెలబోతున్నాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడుతున్నాం. అయినా రాజగోపాల్‌రెడ్డి తమను కాదని, తన మనుషులకే ప్రాధాన్యం ఇస్తున్నారని బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. అనుమానించి, అవమానించే వ్యక్తి కోసం తాము పనిచేయలేమని బీజేపీ పాత క్యాడర్ వెనుదిరిగిపోతున్నది. దీంతో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకర్గానికి ఆనుకొని ఉండే పలు ఫ్యాక్టరీలు, నిర్మాణ సంస్థల్లో పనిచేసే ఇతర రాష్ట్ర కూలీలను తన రోడ్‌షోలకు, సభలకు రప్పిస్తున్నారు.
మునుగోడు, అక్టోబర్ 29: మునుగోడులో శనివారం బీజేపీ నిర్వహించిన నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనం జనం లేక వెలవెలబోయింది. సమావేశానికి వస్తే ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తామని ఆశ జూపినా దళితులు రాలేదు. దీంతో రాజగోపాల్‌రెడ్డి తమ సంస్థల్లో పనిచేసే బీహారీ కూలీలను అక్కడకు రప్పించారు. అయితే వారు కూడా కొద్దిసేపటికే అక్కడి నుంచి ఒక్కొక్కరుగా జారుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నప్పుడు ముందు వరుసలో కూర్చున్నవాళ్లు సైతం వెళ్లిపోయారు.