హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మీనాక్షి నటరాజన్‌పై ఉన్న కేసును బయటపెట్టిన కాంగ్రెస్ కోవర్టు ఎవరు? అంటూ బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ ప్రశ్నించారు. ఈ వివాదంపై బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు మీనాక్షీ నటరాజన్ అంశంపై బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారని, అయితే తెలంగాణలో నమోదైన కేసును పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకొచ్చిందెవరు..? అని ఆయన ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్‌లోని కోవర్టులను పట్టుకొని పరిస్థితులు చక్కదిద్దుకోవాలని హస్తం పార్టీకి హితవు పలికారు.