హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఆదివారం విడుదల చేసిన మొదటి జాబితాను చూసి పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేరే లేకపోవడంతో ‘ఎందుకు?’ అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అంబర్‌పేట నుంచి ఆయన పోటీ చేస్తారని భావించినా.. కొన్ని రోజులుగా తన భార్యకు టికెట్ అడుగుతున్నారని ప్రచారం జరుగుతున్నది. తాను బరిలోకి దిగి ఓడిపోతే పరువు పోతుందని కిషన్‌రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.
భార్య ఓడిపోయినా తాను రాష్ట్రవ్యాప్త ప్రచారంలో ఉండటం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొనేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారట. బీజేపీకి అభ్యర్థులు లేరని మొదటి నుంచీ ఉన్న ప్రచారం నిజమేనని తొలి జాబితాతోనే స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థులు లేకపోవడం వల్లే రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరికీ టికెట్లు ఇచ్చి పోటీ చేయిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. పోలింగ్ తేదీకి మరో 40 రోజుల సమయం కూడా లేదు. 119 మంది అభ్యర్థులను ప్రకటించడం పక్కన పెడితే, కనీసం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పే పరిస్థితిలో కూడా బీజేపీ లేదు. అభ్యర్థులు లేక పొత్తుల కోసం తహతహలాడుతున్నది. తెలంగాణలో ఉనికిలో లేని జనసేనతో పొత్తు పెట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. ఇంకొన్ని చిన్నా చితకా పార్టీలతోనూ చర్చలు జరుపుతున్నారని, ఆ తర్వాతే మిగిలిన స్థానాలపై స్పష్టత వస్తుందని పార్టీ నేతలు చెప్తున్నారు.
వాడుకొని వదిలేశారు!
కొందరు నేతలు తమకు టికెట్లు కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ బహిష్కరణ వేటువేసిన సంగతి తెలిసిందే. శనివారం వరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయలేదు. ఆ సీటును విక్రమ్ గౌడ్‌కు కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు విక్రమ్ గౌడ్ స్థానికంగా ప్రచారం కూడా ప్రారంభించారు. కానీ, అకస్మాత్తుగా ఆదివారం సస్పెన్షన్ ఎత్తివేసి, వెంటనే టికెట్ కేటాయించారు. దీంతో విక్రమ్ గౌడ్ మనస్తాపం చెందినట్టు సమాచారం. టికెట్ కేటాయించాలన్న నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని, అలాంటప్పుడు తనను ఎందుకు నమ్మించి మోసం చేశారని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.
అలాగే అనుగుల రాకేశ్‌రెడ్డి మొదటి నుంచీ వరంగల్ వెస్ట్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆయనకు టికెట్ దాదాపు ఖరారైనట్టేనని సంకేతాలు కూడా వెళ్లాయి. అనూహ్యంగా రావు పద్మకు టికెట్ కేటాయించారు. కల్వకుర్తిలో తళ్లోజు ఆచారికి టికెట్ కేటాయించారు. వాస్తవానికి అక్కడ మరోనేత వరుణ్ వందే కూడా మొదటి నుంచీ పోటీలో ఉన్నారు. ఈసారి యువనేతకు టికెట్ ఇస్తారని ప్రచారం సాగింది. అయితే, కేవలం సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచారికి పదే పదే అవకాశాలు ఇస్తున్నారని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. మానకొండూరులో ఇన్నాళ్లుగా బీజేపీకి గడ్డం నాగరాజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నిన్నగాక మొన్న చేరిన ఆరెపల్లి మోహన్‌కు టికెట్ ఇవ్వడంతో ఆయనా అలిగినట్టు తెలిసింది.