హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ‘మహిళా రిజర్వేషన్లను వేగంగా అమ లు చేసేందుకు’ అంటూ కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. వాస్తవానికి, మహిళా రిజర్వేషన్లను 2029 లోక్‌సభ ఎన్నికల్లో అమలుచేయాల్సి ఉన్నది.
మహిళలకు చట్టసభలో మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తీ వందన’ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. 2027 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పూర్తయ్యాకే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావాలని బిల్లులోనే షరతు పెట్టారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అయినా కేంద్రం ఆగమేఘాల మీద ప్రత్యేకంగా సెషన్ నిర్వహించడం, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వ్యతిరేకించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో రెండు జాతీయ పార్టీలకు ప్రత్యేక రాజకీయ ఎజెండా ఉన్నదని చెప్తున్నారు. వారికి ప్రజాభిప్రాయాలు అవసరం లేదని, వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శిస్తున్నారు.
తమిళనాడు, పశ్చిమబెంగాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది. రెండు పెద్ద రాష్ర్టాల్లో పోలింగ్‌కు సరిగ్గా మూడు రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు పెట్టిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆగాలని విపక్షాలు డిమాండ్ చేసినా, కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. దీనిని బట్టి పోలింగ్‌కు ముందు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ పెట్టడం ద్వారా, మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టాలనేది బీజేపీ ఎత్తుగడ అని విమర్శిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్లు, సాధికారతపై పార్లమెంట్లో ఏ పార్టీ కూడా బాహాటంగా వ్యతిరేకించలేని సంకట స్థితి కల్పించడం ద్వారా విపక్షాలను ఇరకాటంలో నెట్టే వ్యూహం పన్నిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే మహిళా వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తారని చెప్తున్నారు. ఇది గుర్తించిన ఇండియా కూటమి.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది.
పశ్చిమాసియా సంక్షోభానికి సంబంధించి కాల్పుల విరమణ, సంధి కోసం జరిగిన ప్రయత్నాల్లో ప్రధాని మోదీ దౌత్యం బెడిసికొట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తి పాత్రను పాకిస్థాన్ పోషించి, ఇరుపక్షాలను కాల్పుల విరమణకు ఒప్పించే ప్రయత్నం చేయడంతో మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇద్దరు కేంద్ర మంత్రులను పశ్చిమాసియా దేశాలకు పంపి, దౌత్యం నెరిపే ప్రయత్నం చేసినా ఆయా దేశాల నుంచి స్పందన రాలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు హొర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలు నౌకలను దిగ్భందిస్తున్నాయి. మొదట ఇరాన్, ఇప్పుడు అమెరికా విధించిన దిగ్బంధనంతో ఇంధన రవాణా సంక్లిష్టంగా మారింది.
మన దేశానికి చెందిన 15 చమురు నౌకలు ఆక్కడే ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ తన చమురు అవసరాల్లో 90% దిగుమతి చేసుకుంటుండగా, అందులో 50% హొర్ముజ్ జలసంధి ద్వారా వస్తున్నది. ఎల్పీజీ అవసరాల్లో 60% దిగుమతి చేసుకుంటుండగా, అందులో 90% హొర్ముజ్ జలసంధి ద్వారానే వస్తున్నదని చెప్తున్నారు. దిగ్బంధనం వల్ల చమురు ధరలు పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల వేళ ఈ అంశంతోపాటు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ధరల వంటి అంశాలు ప్రజల్లో చర్చకు రాకుండా చూసేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా డీలిమిటేషన్ బిల్లును హడావుడిగా తెరమీదికి తెచ్చిందని విమర్శిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పలు ప్రతిపక్ష పార్టీలు చేతులు కలిపి ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి ఇప్పుడు ఇరకాటంలో పడిందని అంటున్నారు. కూటమికి ఉత్తరాది రాష్ర్టాల్లో పెద్దగా బలం లేదు. దక్షిణాది రాష్ర్టాల్లోనూ అంతంతే. ఇలాంటి సమయంలో డీ లిమిటేషన్ జరిగి నియోజకవర్గాలు పెరిగితే తాము భారీగా నష్టపోతామని ఆయా పార్టీల నేతలు మథనపడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ర్టాల్లో భారీగా సీట్లు పెరుగుతాయనే ప్రచారం ఉన్నది.
దక్షిణాది రాష్ర్టాల్లో నామమాత్రంగా నియోజకవర్గాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్న సూత్రం ప్రకారం పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయనే ప్రచారం జరుగుతున్నది. మొదటి నుంచీ పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఎక్కువ అనే వాదన ఉన్నది. ఇదే జరిగితే పాత, కొత్త స్థానాలతో కలిపి ఎన్డీయే 4వసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఇండియా కూటమి నేతలు భయపడుతున్నారు. అలాగని, ఈ బిల్లు వద్దని ధైర్యంగా చెప్పే పరిస్థితి ఇండియా కూటమికి లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతున్నదని, దీనిపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రికి లేఖ రాశారు. రాష్ర్టాలు, రాజకీయ పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయ సాధనతోనే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. హైబ్రిడ్ విధానం అమలును పరిశీలించాలని కోరారు. లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కి పెంచడం వివాదాస్పద అంశమని పేర్కొన్నారు. మరోవైపు నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి కలిసి రావాలని ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి సీఎంలకు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.
డీలిమిటేషన్‌తో కాంగ్రెస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క తీరు అయిందని అంటున్నారు. అందుకే పూర్తిగా బిల్లును వ్యతిరేకించకుండా హైబ్రీడ్ జీఎస్డీపీ పేరుతో కొత్త వాదన తెరమీదికి తీసుకొచ్చింది. జీఎస్డీపీ ఆధారంగా నియోజక వర్గాల పునర్విభజన చేయాలని దక్షిణాది రాష్ర్టాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ అయితే, దానిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునితో చెప్పించాలేగానీ విభజించు..పాలించు అన్నట్టుగా ఉత్తరాది రాష్ర్టాల్లో ఒక రకంగా, దక్షిణాది రాష్ర్టాల్లో మరో రకంగా వ్యవహరించడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య మాత్రమే జీఎస్డీపీ డిమాండ్‌ను ఎత్తుకోవడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమైతే, హిమాచల్‌ప్రదేశ్ సీఎంతో ఈ తరహా డిమాండ్ ఎందుకు చేయించడం లేదని, ఆ పార్టీ అగ్రనాయకులు ఎందుకు ప్రకటించడం లేదని అడుగుతున్నారు. దీనిని బట్టి ‘అంతా రాజకీయమే’ అనే తరహాలో కేవలం ఎన్నికల్లో లాభనష్టాల కోణంలోనే ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయని స్పష్టమవుతున్నది. అభివృద్ధి, ఆర్థిక సమస్యల కన్నా స్వార్థ రాజకీయలకే ప్రాధాన్యమిస్తున్న తరుణంలో, పార్లమెంట్ సమావేశాలు కేవలం లాంఛనంగా మారుతున్నాయన్న ఆందోళన ప్రజాస్వామ్యవాదుల్లో వ్యక్తమవుతున్నది.