బాలానగర్, సెప్టెంబర్ 8: యాత్రల పేరుతో రాష్ట్రంలో దుష్ట రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు.. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పేదలకు ఏం చేశారో చెప్పాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఓట్లకోసం కుట్ర రాజకీయాలు చేసే నేతలపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఫతేనగర్‌లో 1,200 మంది కొత్త ఆసరా లబ్ధిదారులకు హరీశ్‌రావు పెన్షన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏ రాష్ట్రంలో కూడా పేదలకు రూ.2 వేల పెన్షన్ ఇవ్వడం లేదు. కొంతమంది ఈ మధ్య పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్నరు. వాళ్లను సూటిగా అడుగుతున్నా.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రూ. 2 వేల పెన్షన్ పథకాన్ని ఎందుకు అమలు చేయడంలేదు? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రూ.600 ఇస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వెయ్యే ఇస్తున్నది. మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ సర్కార్ రూ.500 లే ఇస్తున్నది. రూ.2016 పెన్షన్ ఇచ్చి పేదల కడుపు నింపుతున్న నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరే’ అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గతంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేవాళ్లమని, తాజాగా మరో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరుచేశామని తెలిపారు.
బస్తీ దవాఖానతో సుస్తీలు మాయం
రాష్ట్రప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటుచేసి ప్రజలకు సుస్తీ నయం చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బస్తీ దవాఖానలు పేదలకు ఎంతో దగ్గరగా పని చేస్తున్నాయని చెప్పారు. గతంలో ప్రైవేటు వైద్యుల వద్దకు వెళ్లి పేదలు ఇబ్బందులు పడేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటుచేసి ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నదని వెల్లడించారు. కూకట్పల్లి నియోజవర్గంలో మరో 2 బస్తీ దావఖానలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.