Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఓ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెస్టిండీస్‌లోని ఎగ్జిమ్‌బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వానికి గ్యారెంటీలు ఇచ్చినట్టు తెలిసి అనేక అనుమానాలకు బీజం వేసింది.
ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (ఏపీఎస్పీడీసీఎల్) ప్రాజెక్టు డివిజన్‌కు సంబంధించి రూ. 800 కోట్ల విలువైన పనులను దక్కించుకుంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులు చేయాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు ఏపీఎస్పీడీసీఎల్కు రాఘవ కన్స్ట్రక్షన్స్ రూ. 80 కోట్ల బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌కు చెందిన ఎగ్జిమ్‌బ్యాంకు గ్యారెంటీలను సమర్పించింది.
అనుమానించిన ఏపీ ప్రభుత్వం రాఘవ కన్స్ట్రక్షన్స్కు లేఖ రాసింది. ఆ గ్యారెంటీలు ఈ ఏడాది జూన్ 30 నాటికే కాలం తీరిపోయాయని, కొత్త గ్యారెంటీలు సమర్పించాలని కోరింది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ, ఈసారి ఎగ్జింబ్యాంకు నుంచి కాకుండా ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి కానీ, షెడ్యూల్డ్ బ్యాంకు నుంచి గ్యారెంటీలు సమర్పించాలని లేఖలో స్పష్టంగా పేర్కొన్నది. అయితే, బ్యాంకు గ్యారెంటీల గడువు జూన్ 30న ముగిస్తే ఈ నెల 18న ఏపీఎస్పీడీసీఎల్ లేఖ రాయడం గమనార్హం.
ఎక్కడి కంపెనీ.. ఎక్కడి గ్యారెంటీలు
హైదరాబాద్‌లో ఉండే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎక్కడో కరీబియన్ దీవుల్లోని బ్యాంకు నుంచి గ్యారెంటీలు సమర్పించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. దేశంలో బోల్డన్ని బ్యాంకులు ఉండగా దేశం కాని దేశం వెళ్లి అక్కడి నుంచి గ్యారెంటీలు సమర్పించడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. మన రాష్ట్రంలో, ఆ మాటకొస్తే మన దేశంలో ఒక్క శాఖ కూడా లేని బ్యాంకు మంత్రి కంపెనీకి గ్యారెంటీలు సమర్పించడం విడ్డూరంగా ఉన్నది.
ఎగ్జింబ్యాంక్పై అనేక ఆరోపణలు
వెస్టిండీస్‌లోని సెయింట్ లూసియాలో కేంద్రంగా ఉన్న ఈ యూరో ఎగ్జింబ్యాంక్పై అనేక ఆరోపణలున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఓ సంస్థ డిఫెన్స్ పనుల కాంట్రాక్టును సాధించింది. పనులు చేపట్టే ముందు ఈ బ్యాంకు నుంచే గ్యారెంటీలు సమర్పించింది. వాటిని ఆధారంగా చేసుకొని అధికారులు పనులు అప్పగించారు. చివరకు ఆ సంస్థ బిచాణా ఎత్తేసింది. పనులను పూర్తిచేయలేదు. దీంతో అధికారులు నష్టపరిహారం కోసం బ్యాంక్ గ్యారెంటీలను స్వాధీనం చేసుకుందామనుకుంటే వాళ్లు సమర్పించిన గ్యారెంటీలు చెల్లలేదు. వాటితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని బ్యాంకు తేల్చి చెప్పింది. దీంతో రక్షణశాఖ న్యాయపోరాటం ప్రారంభించింది.
యూరో ఎగ్జింబ్యాంక్ మన దేశంలో ఇస్తున్న బ్యాంక్ గ్యారెంటీల పరిస్థితిపై లోక్‌సభ సభ్యుడు కార్తి చిదంబరం భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్‌కు లేఖ రాశారు. మన దేశంలో ఎగ్జింబ్యాంక్ కార్యకలాపాలకు ఆర్బీఐ ఎప్పటి నుంచి అనుమతులు ఇస్తున్నది? అసలు వీటిని నమ్మవచ్చా? వీటిపై మనకు నియంత్రణ ఉంటుందా? వీటి పరిధిని ఎలా నిర్దేశించారంటూ ఈ ఏడాది జూలై 31వ తేదీన లేఖ రాశారు. ఎగ్జింబ్యాంక్ ఇచ్చే బ్యాంక్ గ్యారెంటీలపై లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీలో రూ. 550 కోట్ల విలువైన గ్యారెంటీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మైనింగ్, విద్యుత్తు పంపిణీ, ఉత్పత్తి సంస్థలు, గిడ్డంగుల సంస్థకు రూ. 550 కోట్లమేర ఎగ్జింబ్యాంకు నుంచి ఇచ్చిన గ్యారెంటీలే ఉన్నాయి. ఇక్కడ కాంట్రాక్టర్లు డిఫాల్టయి పనులు చేయలేకపోయినా, ప్రభుత్వానికి ఏదైనా నష్టం వాటిల్లినా బ్యాంకు గ్యారెంటీలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎగ్జింబ్యాంకు తనకెలాంటి బాధ్యత లేదని ప్రకటిస్తే ప్రభుత్వాలు చేసేదేమీలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీలు విరివిగా ఎగ్జింబ్యాంకు గ్యారెంటీలనే సమర్పిస్తున్నట్టు ఏపీ అధికార వర్గాలు చెప్తున్నాయి.
Ponguleti