హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి మెఘా ఇంజినీరింగ్ కంపెనీ కామధేనువుగా మారిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫండ్ కోసమే మెఘా కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డి వంతపాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో మాట్లాడారు.సుంకిశాల ప్రాజె క్టు కూలినా మెఘా కంపెనీపై ఎందుకు చర్య లు తీసుకోవడంలేదని సీఎంను ప్రశ్నించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత నిర్మాణ సంస్థదే అని వాటర్‌బోర్డు చెప్తున్నదని గుర్తు చేశారు.కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని,పైగా అమృత్ సీమ్‌లోని పనులనూ ఆ సంస్థకే అప్పగించడం విడ్డూరమని అన్నారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టులో జరిగిన నష్టాన్ని పూర్తిగా కంపెనీ నుంచే రికవరీ చేయాలని, లేకపోతే కంపెనీపై, ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.