హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తున్నదని, వచ్చే ఏడాది జూన్-డిసెంబర్ మధ్య రాష్ర్టానికి కొత్త సీఎంను నియమించే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం ఢిల్లీకి 7 సార్లు వెళ్లినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.
ఇటీవల ప్రియాంక నామినేషన్ కార్యక్రమం కోసం వాయనాడ్‌కు వెళ్లినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. త్వరలో రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పడబోతున్నదని చెప్పారు. మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్లకు పెంచారని, ఇందులో భారీ కుంభకోణం జరుగబోతున్నదని అధిష్ఠానం భావిస్తున్నదని తెలిపారు. సీఎం భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారని, దీనిని అధిష్ఠానం కూడా నమ్ముతున్నట్లు చెప్పారు.
తమకు ఏమీ దొరకుండా చేస్తున్నారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు ఒక గ్రూప్‌గా ఏర్పడి ఢిల్లీలో భేటీ అయ్యారని ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారిందని పేర్కొన్నారు. హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్మెంట్లపై హైకమాండ్‌కు నివేదికలు పంపుతూనే ఉన్నారని చెప్పారు.
కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, కేవీపీ రామచందర్‌రావు తదితరుల ప్రాపర్టీలపై ఒక సీనియర్ నేత మూసీ అంశంపై సోనియా గాంధీకి నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోనియా ఆదేశంతో డీకే శివకుమార్ రంగంలోకి దిగి, విచారణ చేస్తున్నారని చెప్పారు. సీఎం రేసులో ముగ్గురు సీనియర్ మంత్రులు ఉన్నారని, వారు పూస గుచ్చినట్టు అన్ని విషయాలు ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారని తెలిపారు.