హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేశంలోనే భారీ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శకాలకు విరుద్ధంగా, తప్పుడు డాక్యుమెంట్లతో దేశ చట్టాలతో సంబంధంలేని యూరో ఎక్సిమ్ బ్యాంకు, అదేవిధంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకుల గ్యారెంటీలను చూపి వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులను దక్కించుకున్నారని విమర్శించారు. అలాంటి కుంభకోణంలో ఉన్న పొంగులేటి మంత్రి పదవికి అనర్హుడని పేర్కొన్నారు.
సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్ వద్ద మాట్లాడుతూ.. రాష్ట్రంలో సర్పంచ్‌లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రావడం లేదని, కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన వందల కోట్ల బిల్లులు మాత్రం క్లియర్ అవుతున్నాయని విమర్శించారు. ఫేక్ డాక్యుమెంట్లతో వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుని, ప్రభుత్వాన్ని, చట్టాలను మోసం చేస్తున్నారని, వాటిపై న్యాయ విచారణతోపాటు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విచారణ కోసం సీబీఐని కోరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళలు, విద్యార్థులు, రైతులు, ప్రజాసమస్యలను లేవనెత్తుతామని వెల్లడించారు.