BJLP Leade Eleti | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గం శనివారం తీసుకున్న నిర్ణయాలు నిరాశ పరిచాయని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న రైతు భరోసాపై స్పష్టత లేదన్నారు. పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉన్నాయని చెప్పారు.
తాను లేవనెత్తిన పలు అంశాలపై స్పందించక పోవడం ప్రభుత్వం తప్పు చేసిందనే దానికి నిదర్శనం
అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వ్యవహారంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లిఫ్ట్ టెండర్లలో గోల్ మాల్ సంగతేమిటని నిలదీశారు. ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాడుతామని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని స్పష్టం చేశారు.