రవీంద్రభారతి, ఆగస్టు 18: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం ఆదర్శనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్‌గౌడ్ కొనియాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం బీసీ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ 374వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని చేసి చూపిన పాపన్నగౌడ్ జీవితం తమ ఇందిరమ్మ రాజ్యానికీ ఆదర్శమని పేర్కొన్నారు. పాపన్నగౌడ్ పుట్టిన ఖిలాషాపూర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూ.4.70 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. పాపన్న జీవిత చరిత్రపై రూపొందించిన పాకెట్ బుక్‌ను ప్రతి గ్రామంలో పంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మె ల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.