Bio Asia 2024 | వచ్చే ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సు జరుగనున్నది. సదస్సు జరిగే తేదీలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో బయో ఏషియా సదస్సును నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డాటా అండ్ ఏఐ-రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ థీమ్‌తో సదస్సు జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహిస్తుండగా.. పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నది.
ఈ ఏడాది హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు 20వ ఎడిషన్ బయో ఏషియా సదస్సు జరిగింది. ‘మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం’ అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో 50 దేశాల నుంచి దాదాపు 5,600 మంది ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధుల పాల్గొన్నారు. సదస్సులో రెండురోజులపాటు లైఫ్‌సైన్సెస్, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు, మూడోరోజు వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన, జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమాలు జరిగాయి.