హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర పోరాటకాలంలో గాంధీజీ నినదించిన ‘స్వరాజ్యం’ అర్థం అందరికీ కూడు, గూడు, గుడ్డ అని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ బినోయ్ విశ్వం చెప్పారు. కానీ ఇప్పటికీ స్వరాజ్యం ఎక్కడున్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ నినదిస్తున్న ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ పూర్తి అబద్ధమని వెల్లడించారు. బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం అంటకాగుతున్నదని విమర్శించారు.
సీపీఐ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు 111వ జయంతి కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని సీఆర్ ఫౌండేషన్లో జరిగింది. దీనికి హాజరైన బినోయ్ వి శ్వం మాట్లాడుతూ దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక సవాళ్లు ఉన్నాయని, ఫాసిజం ఎత్తుగడలో భాగంగా మతోన్మాదం పేరుతో ప్రజలను చీల్చి దోచుకునే ఎత్తుగడ కొనసాగుతున్నదని విమర్శించారు.