హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజునే రాష్ట్రంలోని మాజీ సర్పంచులు రోడ్డెకారు. పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్, పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు గడుస్తున్నా.. మాజీ సర్పంచుల బిల్లుల విషయంలో సర్కార్ మొండివైఖరి ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. అనంతరం పీఆర్ కమిషనర్ దివ్యాదేవరాజన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.