భిక్కనూరు, జనవరి 7 : తమ ఊరికి ఫార్మా కంపెనీ వద్దంటూ కామారెడ్డి జిల్లా భిక్కనూరు వాసులు తేల్చిచెప్పారు. భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యూజన్ హెల్త్‌కేర్ ఫార్మా కంపెనీపై బుధవారం ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కామారెడ్డి అదనపు కలెక్టర్ విక్టర్, కాలుష్య నియంత్రణ మండలి ఉమ్మడి జిల్లా అధికారి లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ప్రజలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అనుమతించవద్దంటూ వారంతా ముక్తకంఠంతో స్పష్టంచేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న ఫార్మా కంపెనీతో జల, వాయు కాలుష్యం జరిగి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
విలువైన పంట భూములు నాశనం అవుతున్నాయని, బోరుబావుల్లో విషతుల్యమైన నీరు వస్తున్నదని తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడుతుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఫార్మా కంపెనీ వద్దని నెలల తరబడి దీక్షలు చేసి, కాలుష్య నియంత్రణ మండలితోపాటు సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ‘ప్రాణాలైనా ఇస్తాం.. ఫార్మా కంపెనీని రానివ్వం’ అని నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించడంపైనా గ్రామస్థులు మండిపడ్డారు.
ఇతర ప్రాంతానికి చెందినవారు కార్యక్రమానికి హాజరై..కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా రాతపూర్వకంగా లేఖ ఇస్తుండటాన్ని గుర్తించిన గ్రామస్థులు వారిని అడ్డుకుని, నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకొని స్థానికేతరులను బయటికి పంపించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలు నమోదు చేసుకున్నామని, రాతపూర్వకంగా ఇచ్చిన వినతులు స్వీకరించామని తెలిపారు. వాటిని ప్రభుత్వానికి అందజేయనున్నట్టు చెప్పారు. మొత్తం 39 మంది మాట్లాడారని, వారందరూ ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించారని తెలిపారు. మరోవైపు ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గామస్థులు భిక్కనూరు బంద్‌ను పాటించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.