మేడ్చల్, సెప్టెంబర్21(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని బీహార్ వ్యాపారుల అసోషియేషన్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మద్దతు తెలిపింది. కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి బుధవారం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను సంఘం ప్రతినిధులు ప్రగతి భవన్లో కలిశారు. వచే నెల 30, 31వ తేదీల్లో ట్యాంక్‌బండ్ బతుకమ్మ ఘాట్ వద్ద జరగనున్న ఛట్ పూజ కు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రాకను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 10 లక్షల మందికి పైగా బీహారీలు కేసీఆర్ స్థాపించనున్న జాతీయ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్టు స్పష్టంచేశారు. కేసీఆర్‌కు మద్దతుగా బీహార్‌లో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి బీహారీ వ్యాపారులు సీఎం కేసీఆర్‌కు అభిమానులైనట్టు తెలిపారు.
కేసీఆర్ నాయకత్వం ఇప్పుడు దేశానికి అత్యవసరం. 75 ఏండ్ల స్వంతంత్ర భారతంలో ప్రస్తుత ప్రమాదకరమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేందుకు చూస్తున్నారు. ఇప్పటి దుర్భర పరిస్థితులకు మోదీ ప్రధాన కారకుడు. అఖండ భారతాన్ని అశాస్త్రీయమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. ఐక్యరాజ్య సమితితోపాటు ప్రపంచ మేధావి వర్గమంతా ప్రశంసిస్తున్న అభివృద్ధి ప్రణాళికలు తెలంగాణలో మాత్రమే కొనసాగుతున్నాయి. దేశంలోని అతి ప్రసిద్ధమైన భారీ సంస్థలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి దేశాన్ని ధ్వంసం చేయడం నరేంద్ర మోదీ చేస్తున్న ఒక అరాచక దేశద్రోహ చర్య. ఈ సంక్లిష్ట స్థితి నుంచి దేశాన్ని రక్షించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క కేసీఆర్‌కే సాధ్యం. అందువల్ల చైతన్యవంతులైన ప్రజలు కేసీఆర్ వెంట దండుగా నడవాలి.
– ఆచార్య రామా చంద్రమౌళి, కవి, రచయిత
ఏ ప్రాంతీయ పార్టీకైనా.. జాతీయ రాజకీయాల్లో భాగం పంచుకోవడం అత్యవసరం. ఎందుకంటే.. నేటి రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ, ప్రతిపక్ష వ్యవస్థ అవసరం. ఒక ప్రాంతీయ పార్టీ దేశాన్ని పాలించలేదు. కానీ, ఒక భావజాలంతో కూడుకున్న ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం నేడు ఉన్నది. దేశ ప్రజలు కేసీఆర్‌ను ఎందుకు కోరుకుంటారంటే.. ఆయన పాలకుడిగా కన్నా ఉద్యమకారుడిగా జాతీయ స్థాయికి ఎదిగిన ధీశాలి. ప్రజల్లో, పలు పార్టీల నాయకుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రధాన ప్రతిపక్షంగా పార్టీలను ఐక్యం చేయగల సత్తా ఆయనకు ఉన్నది. భారతదేశపు సాంస్కృతిక ఉద్యమం. ప్రజా ఉద్యమానికి అన్ని రాష్ర్టాల ప్రజలను, సాహిత్యకారులు, ఉద్యమకారులు, మేధావులు, కవులు, రచయితలను సంఘటితపర్చుకోవాల్సిన అవసరం కేసీఆర్‌కు ఉన్నది.
– ప్రొఫెసర్ నాళేశ్వరం శంకరం, ప్రముఖ కవి, రచయిత
రోజు రోజుకూ రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోతున్నది. కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి రావాలి. జాతీయ రాజకీయాలు ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు. ప్రాంతీయ పార్టీలూ తమ సత్తా ఏంటో నిరూపించుకోవచ్చు. అందుకు సరైన సత్తువ గలవారు కేసీఆర్ ఒక్కరే. దేశాన్ని అగాధంలోకి తోస్తున్న మతతత్వ పార్టీలకు కేసీఆర్ దీటైన జవాబు చెప్పగలరు. మోదీ పాలన సగటు మనిషికి భయానక వాతావరణాన్ని తెచ్చిపెడుతున్నది. యువతకు ఉపాధి కల్పించాల్సింది పోయి.. పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ, ఆశావహుల జీవితాల్లో నిప్పులు పోస్తున్నది. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాల్ని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి బడుగుబలహీన వర్గాలను ఆదుకుంటున్నది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడంలో తప్పులేదు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాగా వేయాలి.
– బీ సునీత అసిస్టెంట్ ప్రొఫెసర్, రచయిత్రి
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రజలను ఏకం చేసిన చైతన్యవంతులు సీఎం కేసీఆర్. దేశ ప్రజల నాడీ, వేడీ తెలిసి సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగిన ప్రతిభావంతమైన కార్యశీలి ఆయన. తన వాగ్ధాటితో కోట్లాది మందిని ప్రభావితం చేయగల శక్తి యుక్తులు కలిగిన ధీరోదాత్తుడు. తన మేధాశక్తితో ప్రజా జీవితాల్ని సుసంపన్నం చేయగల సమర్థుడు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం శుభపరిణామం. కేసీఆర్ దేశ సేవలో పాల్పంచుకోవాలని ఆశిస్తున్నా. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఈ తరుణంలో ఆయన రాక దేశానికి, దేశ ప్రజలకు ఒక వేడుక, ఒక ఉత్సవం కావాలి. జాతిని ఏకతాటిపై నడిపించగల బుద్ధిశాలి కేసీఆర్. ఆయన ఆగమనం దేశ ప్రజలకు ఒక సువర్ణ అధ్యాయం కావాలి. యువత జీవితాల్లో వెలుగులు నింపాలి.
– పోలోజు శ్రీహరి,కవి, రచయిత