హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎరువుల కొరత పాపం ముమ్మాటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీలదేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులే యూరియాను బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎరువులను కొందరు కాంగ్రె స్ నాయకులు బ్లాక్ మారెట్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 70 లక్షల మంది తెలంగాణ రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే కాంగ్రెస్, బీజేపీలు ఎలక్షన్లు, కలెక్షన్లు అని నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని, లేకుంటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో బుధవారం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత, అనుభవలేమి, ప్రణాళిక రాహిత్యంతోనే యూరియా కొరత రైతులను వేధిస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లలో ఏ ఒకరోజు కూడా ఎరువుల కొరత రాలేదని గుర్తుచేశారు. సీజన్‌కు ఆరు నెలల ముందే 24 గంటలపాటు మానిటరింగ్ చేసి కేసీఆర్ ఎరువులను తీసుకొచ్చేవారని చెప్పారు. కానీ, రెండు నెలలుగా తెలంగాణలోని ఏ పల్లె చూసినా రైతుల దయనీయ పరిస్థితి కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎరువుల కోసం చాంతాడంత లైన్లో ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ నిలబడి రైతులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. యూరియా కోసం దుకాణాల ముందు మహిళా రైతులు రాత్రంతా పడిగాపులు పడే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ ఇలా లేదు
కేసీఆర్ ప్రభుత్వంలో ఆరు నెలల ముందు నుంచే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేసేవాళ్లమని, ఆరు నెలల ముందే బఫర్‌స్టాక్‌ను తీసుకొచ్చి గోదాముల్లో నిలువ చేసి రైతులకు అందించేవాళ్లమని కేటీఆర్ చెప్పారు. రైతుల కడుపులో సల్ల కదలకుండా ఇంటికి ఎరువుల బస్తాలు పంపామని గుర్తుచేశారు. కానీ, ‘కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఒక సమీక్ష, సన్నద్ధత, ప్రణాళిక లేకుండా ఉన్నది. రేవంత్ ప్రభుత్వ అనుభవరాహిత్యం, ప్రణాళికారాహిత్యం, పరిపాలన చేతకానితనం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నది. రైతులు అవస్థలు పడుతున్నరు’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ, మారెటింగ్ శాఖ, రవాణా శాఖ, జిల్లా యంత్రాంగం మధ్య తీవ్రమైన సమన్వయ లోపం ఉన్నదని, అందుకే వచ్చిన ఎరువులను కూడా సరిగా పంపిణీ చేయలేకపోతున్నారని విమర్శించారు. ‘ఒకవైపు రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా చాంతాడంత లైన్లు కనిపిస్తుంటే సీఎం రేవంత్ మాత్రం అసలు ఎరువుల కొరతే లేదు. ఇదంతా కృత్రిమ కొరత, సోషల్‌మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం అని జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తున్నారు. దమ్ముంటే ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడాలి’ అని కేటీఆర్ సవాల్ చేశారు.
ఎవరిది డ్రామా? రేవంత్ చెప్పాలి
24 గంటలూ బురద రాజకీయాలు చేయడమే తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా రేవంత్‌రెడ్డి చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ నాయకులే ఎరువులను బ్లాక్‌లో అమ్ముతున్నారనే అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. ‘ప్రైవేటు కంపెనీలకు లబ్ధి కలిగించి వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఏమైనా ఉన్నదా? కృత్రిమ కొరత సృష్టించి ఎరువులను అధిక ధరలకు అమ్మి కాంగ్రెస్ నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారా? రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని సీఎం చెప్తుంటే, అకడ ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మాత్రం కేంద్రం సరిపోయేంత ఎరువులు ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నరు. అంటే సీఎం చెప్తున్నది అబద్ధమా? కాంగ్రెస్ ఎంపీలు ఆడుతున్నది డ్రామానా? స్పష్టం చేయాలి. 51సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ముఖం చూసైనా 51 బస్తాల యూరియాను మోదీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ రాష్ట్రంలో పుట్టినరోజు గిఫ్ట్‌గా ఎరువుల బస్తాలను ఇచ్చే దుస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదు’ అని కేటీఆర్ విమర్శించారు.
త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం
రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో 70 లక్షల మంది తెలంగాణ రైతులు నష్టపోతున్నారని కేటీఆర్ చెప్పారు. వారి తరఫున కొట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని, త్వరలోనే పోరాట కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఢిల్లీకి నోట్ల మూటలు మోయడంలో చూపించిన శ్రద్ధలో పావు వంతైనా ఎరువుల బస్తాలు తీసుకురావడంలో రేవంత్‌రెడ్డి చూపిస్తే ఇవాళ ఈ సంక్షోభం వచ్చేదే కాదని స్పష్టం చేశారు. ‘ఇంత జరుగుతుంటే ఒక బీజేపీ ఎంపీ, కేంద్రం మంత్రి, ఎమ్మెల్యే, నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని అడగడం లేదు. కనీసం కేంద్రం నుంచి ఎన్ని ఎరువులు వచ్చాయనేది కూడా చెప్పడం లేదు. 8+8 సున్నా అని మేము ఎప్పుడో చెప్పాము. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది గుండు సున్నా అని చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
రామగుండం ఫ్యాక్టరీ పూర్తిగా ఎందుకు పనిచేయడం లేదు?
రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ పూర్తి సామర్థ్యంతో ఎందుకు పనిచేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం స్పందించి ఫెర్టిలైజర్ యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘బీఆర్ఎస్ హయాంలో సీజన్ మొదలుకాకముందే కేసీఆర్ 24 గంటలపాటు మానిటరింగ్ చేసి ఎకడా ఎరువుల కొరత రాకుండా అందరినీ ఉరికిచ్చేవారు. ఎరువులు తకువ ఉన్నాయని తెలిస్తే అధికారులు, మంత్రులను ఢిల్లీకి పంపించి సరిపడేంత స్టాక్ తెప్పించేవారు. ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి. లేకుంటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పోరాట కార్యచరణను ప్రకటిస్తాం. రాబోయే వారం రోజులపాటు ఎరువుల పంపిణీ జరిగే ప్రాంతాలకు వెళ్లి కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉన్నదో రైతులకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు వివరించాలి. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి ఎరువుల కొరతపై మేం చర్చిస్తాం. సమస్య పరిషారానికి ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకుంటాం. రైతులు ఎవరూ ధైర్యం కోల్పోవద్దు. బీఆర్ఎస్ అండగా ఉంటుంది. రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని కేటీఆర్ తెలంగాణ రైతాంగానికి భరోసా ఇచ్చారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
కాంగ్రెస్, బీజేపీ రెండూ తమకు సమానమేనని, వాటికి తాము సమదూరమే పాటిస్తున్నామని కేటీఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ సర్వ స్వతంత్ర పార్టీ అని, తమకు ఢిల్లీలో బాస్ ఎవరూ లేరని పునరుద్ఘాటించారు. ‘ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇంతవరకు ఎన్డీయే, ఇండియా కూటములకు చెందిన వారెవ్వరూ మా పార్టీని సంప్రదించలేదు. ఉప రాష్ట్రపతి ఎన్నికపై బీఆర్ఎస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల తేదీ సెప్టెంబర్ 9 నాటికి పార్టీలో చర్చించి వైఖరిని ప్రకటిస్తాం. మేము ఎన్డీయే కూటమిలో లేము. ఇండియా కూటమిలోనూ లేము. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం’ అని కేటీఆర్ తెలిపారు. ‘కాంగ్రెస్ ఒక చిల్లర పార్టీ. ఒక థర్డ్ క్లాస్ పార్టీ. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి ఒకవేళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదిస్తే మేము ఎలా సపోర్ట్ చేస్తాం? బీసీల మీద ప్రేమ కురిపించే కాంగ్రెస్ పార్టీ మరి బీసీ నాయకుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదు? కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా? కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో తెలంగాణకు పైసా ప్రయోజనం రాదు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
పీవీని కాంగ్రెస్ ఎంత అవమానించిందో మర్చిపోయారా?
కాంగ్రెస్ పార్టీ తీరు అనాదిగా తెలుగువారిని అవమానిస్తూనే వచ్చిందని ఒక ప్రశ్నకు బదులుగా కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఠీవి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విషయంలో కాంగ్రెస్ ఫ్రైడ్ ఏమైందని ప్రశ్నించారు. పీవీకి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని అప్పుడే మర్చిపోయారా? అని నిలదీశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా సేవలు అందించిన పీవీకి కనీసం ఢిల్లీలో స్మృతివనాన్ని కూడా నిర్మించకుండా కాంగ్రెస్ అవమానించిందని గుర్తుచేశారు. పీవీ అంత్యక్రియలు కూడా సక్రమంగా నిర్వహించకుండా ఆయనను ఎంత దారుణంగా ఆ పార్టీ అవమానించిందో అప్పుడే మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
బీహార్ నుంచే బ్యాలెట్ పెట్టాలి
వచ్చే నవంబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బ్యాలెట్ పేపర్ పోలింగ్ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ వంటి అనేక దేశాలు ఈవీఎంలను వదిలేసి బ్యాలెట్ ఓటింగ్‌ను అమలుచేస్తున్నాయని చెప్పారు. ఈవీఎంలను పక్కనబెట్టి పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ తరఫున మొదటి నుంచీ చెప్తున్నామని, ఇటీవల ఈసీతో జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించామని పేర్కొన్నారు.
బీజేపీలో చేరగానే సఫేద్ అవుతున్నరు
తీవ్ర అవినీతి, నేరారోపణలు ఎదుర్కొంటున్న నాయకులు బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా తరహాలో సఫేద్ అవుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తీవ్ర నేరారోపణలో అరెస్టు అయితే ప్రధాని, సీఎం, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లుపై కేటీఆర్ స్పందించారు. విపక్ష పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకే బీజేపీ ఈ కొత్త బిల్లును పెడుతున్నదని ఆరోపించారు. వివిధ పార్టీల నేతలపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసే బీజేపీ నేతలు.. ఆ పార్టీలో చేరగానే పరిశుద్ధులై పోతున్నారని, వారిపై ఎలాంటి ఈడీ, కేంద్ర సంస్థల దాడులు, కేసులు ఉండటం లేదని గుర్తుచేశారు.
బతకడానికి వచ్చిన ప్రతిఒక్కరూ తెలంగాణ బిడ్డలే
రాష్ర్టానికి బతుకుదెరువు కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలుగానే బీఆర్ఎస్ భావిస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు. మార్వాడీ హఠావో అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. రాష్ర్టానికి ఉపాధి, వ్యాపారాల నిమిత్తం వచ్చే ఎవరైనా తెలంగాణ కుటుంబసభ్యులేనని అన్నారు. ఈ అంశాన్ని పెంచితే రాష్ర్టానికి తీవ్ర నష్టమని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సద్దుమణిగేలా చూడాలని సూచించారు. అన్ని వర్గాలతో చర్చించి సమస్యను ముగించాలని కోరారు. భవిష్యత్తులో తెలంగాణ మినీ భారత్‌గా అవతరించబోతున్నదని, దేశానికి మన రాష్ట్రమే ద్వీపస్తంభమని అభివర్ణించారు. కొవిడ్ కాలంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చిన కార్మికులను ప్రత్యేక రైళ్లు వేసి, చేతిలో డబ్బులుపెట్టి మరీ వారి వారి ప్రాంతాలకు పంపించారని గుర్తుచేశారు. సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియానాయక్, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, మెతుకు ఆనంద్, కోరుకంటి చందర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, పల్లె రవికుమార్, చిరుమళ్ల రాకేశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
70 లక్షల మంది తెలంగాణ
రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే కాంగ్రెస్, బీజేపీలు ఎలక్షన్లు, కలెక్షన్లు అని నాటకాలు ఆడుతున్నాయి. ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి. లేకుంటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పోరాట కార్యాచరణను ప్రకటిస్తాం.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గౌడ సోదరులకు బీఆర్ఎస్ హయాంలో వైన్స్ కేటాయింపులో 15% రిజర్వేషన్ అమలు చేశాం. తాము అధికారంలోకి వస్తే 25% అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. దానిని వెంటనే అమలుచేయాలి.
ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో ఒక బస్తా ఎరువు దొరక రైతులు ఆగమాగం అవుతున్నరు. ఎరువుల బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద అన్నదాతలు పడే దుస్థితి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రైతు డిక్లరేషన్ పేరుతో అది చేస్తాం ఇది చేస్తామని గప్పాలు కొట్టిన రాహుల్‌గాంధీ ఇవాళ తెలంగాణలో యూరియా లేక రైతులు అల్లాడుతుంటే పార్లమెంట్లో నోరెందుకు మెదపడం లేదు? ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు?
– కేటీఆర్
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లలో ఎన్నడూ ఎరువుల కోసం రైతులు లైన్లు కట్టలేదు. రాత్రంతా పడిగాపులు కాయలేదు. పోలీసులను పెట్టి ఎరువులు పంచాల్సిన దుస్థితి ఏ రోజూ రాలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో తెలంగాణ రైతన్నలు
ఆలోచించాలి.-కేటీఆర్
పరకాల నియోజకవర్గం నల్లబెల్లిలో తన కుటుంబసభ్యుల ఆధార్‌కార్డుతో మూడు బస్తాల యూరియా తెచ్చిన రైతుపై రేవంత్ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్టు చేసింది. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉన్నదా? రాష్ట్రంలో ఎరువుల కొరత ఇంత తీవ్రంగా ఉండి రైతులు అరిగోస పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎకడ ఉన్నరో?ఏం చేస్తున్నరో తెలియడం లేదు.-కేటీఆర్