Telangana | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) రాష్ట్రంలోని సుమారు ఏడు వేల మంది ఉద్యోగులకు పిడుగులాంటి వార్త ఇది. తాత్కాలిక ప్రాతిపదికన నియామకమై ఆ తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో రెగ్యులరైజ్ అయిన వారు, నాన్ మస్టర్‌రోల్ (ఎన్ఎంఆర్)గా చేరినవారు, న్యాయస్థానాల ద్వారా తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయించుకున్నవారికి రిటైర్మెంట్ బెనిఫిట్లను ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆగమేఘాలపై ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ పేరున గెజిట్ కూడా విడుదలైంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు ఏడువేల మంది ఉద్యోగులు నికరంగా రూ.20వేల కోట్లు నష్టపోనున్నారు. ఈ గెజిట్ వల్ల రూ.20వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు మిగులుతాయని ప్రభుత్వం చెప్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారం కాకూడదంటే ఈ ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్లు ఏమీ ఉండకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, సాధారణ పరిపాలనాశాఖల అధికారులు ఏకంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాల్లో చర్చించి ఆమోదించింది. అందుకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఇచ్చింది. ఈ నెల 25న గెజిట్ కూడా జారీ అయింది. గెజిట్ కాపీ, ప్రభుత్వ ఉత్తర్వులను దాచిపెట్టారు. ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి చర్చలు లేకుండా.. ఉద్యోగులకు తెలియకుండానే ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని ఏడు వేల మందికిపైగా ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్లను కోల్పోనున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.20వేల కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం క్యాబినెట్‌కు సమర్పించిన నివేదికలోనే పేర్కొన్నది.
రాష్ట్రంలో 2/94 యాక్ట్ ప్రకారం వివిధ శాఖల్లో, ముఖ్యంగా నీటిపారుదల, విద్య, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో టైమ్ స్కేల్‌పై పనిచేసినవారిని, ఎన్‌ఎంఆర్‌గా చేరినవారు, అయిదేండ్లు, పదేండ్లకుపైగా పనిచేసిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. అంతకుముందు కూడా కొంతమంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. వారు తమను కూడా రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణించాలని, రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నట్టు ఉద్యోగ విరమణ బెనిఫిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్లను లెక్కించేందుకు తాము తాత్కాలిక ఉద్యోగిగా ఎప్పుడైతే ఉద్యోగంలో చేరామో.. అప్పటి నుంచే సర్వీసును లెక్కించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో, కొన్ని శాఖల్లో ప్రభుత్వం వారి డిమాండ్లను అంగీకరించి బెనిఫిట్లను ఇచ్చింది. ప్రభుత్వం ఒప్పుకోని పరిస్థితుల్లో అలాంటి ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. న్యాయస్థానాలు కూడా ఉద్యోగుల సర్వీసును లెక్కించే విధానాలపై ఎప్పటికప్పుడు ఉత్తర్వులు ఇచ్చింది. వందలాది మంది ఉద్యోగ విరమణ సమయంలో తమ సర్వీసును తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బెనిఫిట్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రభుత్వం వినకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించి విజయం సాధించారు. పాత జీతం, డీఏలతోపాటు ఇవ్వాలని కూడా ప్రభుత్వాలను కోర్టులు ఆదేశిస్తున్నాయి.

Retirement Benefits
టైమ్ స్కేల్, తాత్కాలిక పద్ధతిలో నియామకమై.. ఆ తర్వాత రెగ్యులర్ అయిన ఉద్యోగులు, 5, 10 ఏండ్లు గంటలు, రోజుల కింద పనిచేసివారి సర్వీసు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) వచ్చే నాటికే, 2004కు పూర్వమే రెగ్యలరైజ్ అయ్యింది. ఇలా రెగ్యులరైజ్ అయినవారు ఇప్పుడిప్పుడే ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఇలా పదవీ విరమణ పొందినవారు తమకు సీపీఎస్‌కు ముందున్న పాత పెన్షన్ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని వీరికి వర్తింపజేయడానికి సుముఖంగా లేదు. సీపీఎస్ రావడానికి ముందున్న రెగ్యులర్ రిక్రూటీలకు ఇచ్చినట్టు వీరికి కూడా పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అనే భావన వ్యక్తమైంది.
రేవంత్‌రెడ్డి సర్కారు దీనిపై ఉన్నతాధికారులతో ఒక కమిటీని వేసి తాత్కాలిక, టైమ్ స్కేల్ ఉద్యోగులుగా నియామకమై పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన బెనిఫిట్లలో ఎలా కోత పెట్టాలన్న విషయంపై నివేదిక తెప్పించుకున్నది. ఈ నివేదికను ఇప్పుడు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల్లా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వకుండా ఉండాలంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే ఇస్తే సరిపోదని, కచ్చితంగా చట్టం చేయాల్సి ఉంటుందని, చట్టం చేస్తే రక్షణ ఉంటుందని, లేకపోతే న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని తప్పుబడుతాయని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నివేదించారు.
ఇప్పటికిప్పుడు చట్టం చేయాలంటే కుదరదని, అందుకే తక్షణం ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్టు స్పష్టమవుతున్నది. రానున్న శాసనసభ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బిల్లును రూపొందించి ఆమోదింపజేయనున్నారు. అలా సుమారు ఏడు వేల మందికిపైగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ విరమణ బెనిఫిట్లను ఎగ్గొట్టచ్చన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తున్నది.
2004కు ముందున్న పాత విధానంలో ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలన్నా, సర్వీసును లెక్కించాలన్నా ప్రభుత్వానికి భారమవుతుందని, అవన్నీ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు న్యాయస్థానాలకు తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానాలు తప్పుపట్టాయి. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన సొమ్మును ఇవ్వకపోతే ఎలా అంటూ మందలించడంతోపాటు వడ్డీతో చెల్లించాలని కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చాయి. ప్రభుత్వ వాదనతో న్యాయస్థానాలు ఏకీభవించలేదు.
ఈ నేపథ్యంలో గత పరిణామాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా చట్టం చేసి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్లను ఎగ్గొట్టాలని నిర్ణయించింది. రెట్రాస్పెక్టివ్ సర్వీస్ రెగ్యులరైజేషన్ చేయలేమని, బెనిఫిట్లు కూడా ఇవ్వలేమని చెప్తూ.. ఏకంగా ఇప్పుడు ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. సర్వీసు ముగిసి, ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు చెప్తున్నారు.