ఏ ప్రభుత్వమైనా కొందరు మంత్రులకు ఉద్వాసన పలుకాలంటే.. సాధారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చూస్తుంటాం. లేదా సదరు మంత్రిని ఒప్పించి రాజీనామా చేయించడం చూశాం. లేదా ఏకంగా బర్తరఫ్ చేయడం చూశాం. లేదా ప్రత్యామ్నాయ పదవులకు మార్చడం కూడా చూశాం. కానీ మంత్రి పదవుల నుంచి తప్పించడానికి వ్యక్తిత్వ హననం చేయడం ఇప్పుడే చూస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే రాజకీయం నడుస్తున్నది. ఇద్దరు, ముగ్గురు మంత్రులను తప్పించేందుకు ప్రభుత్వంలోని పెద్దలు తమ అనుకూల మీడియా చానళ్లకు లీకులిచ్చి, కొందరితో సంబంధాలు అంటగట్టి వాటిని వ్యాప్తిలోకి తెస్తున్న విస్మయకర పరిస్థితులు రాష్ట్ర రాజకీయాలు, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురు మంత్రులపై వేటు పడనున్నదా? తనకు లొంగని వాళ్లను బయటకు పంపి, అనుకూలమైన వ్యక్తులకు పదవులు ఇప్పించుకునేందుకు ముఖ్యనేత పన్నాగం పన్నారా? లైంగిక ఆరోపణలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేయడం ఇందులో భాగమేనా? కావాలనే తన అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారా? కొంత మంది మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారని గత అక్టోబర్‌లో ఎల్లో మీడియాలో రాసిన రాతలకు ఇప్పుడు జరుగుతున్నది కొనసాగింపా? తనను విఫల నేతగా చిత్రీకరించే కుట్రలకు త్వరలో ముగింపు పలుకుతానంటూ ముఖ్యనేత చేసిన శపథంలో పరమార్థం ఇదేనా? పొమ్మనలేక పొగబెట్టేలా అనుకూల మీడియాతో దాడులు చేయించి, బయటకు వెళ్లిపోయేలా చేయడమేనా? అంటే గాంధీభవన్ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది.
వాస్తవానికి కొందరు మంత్రులపై ‘ముఖ్యనేత’ ఖడ్గం వేలాడుతున్నదని, త్వరలోనే వారిని మంత్రి వర్గం నుంచి తప్పించే కుట్రలు జరుగుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ గతంలోనే పసిగట్టింది. నవంబర్లోనే హెచ్చరిస్తూ ఓ కథనం ప్రచురించింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రుల పేర్లను కూడా ‘నమస్తే’ పరోక్షంగా ప్రస్తావించింది. వారికి ప్రమాదం పొంచి ఉన్నదని విశ్లేషించింది. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘1980-90 మధ్య సీఎం పదవి కోసం హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించిన కాంగ్రెస్ సంస్కృతి ప్రజలకు అనుభవమే. 2009-13 మధ్య అధికార పీఠం కోసం అధిష్ఠానం కాళ్ల దగ్గర మోకరిల్లిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులనూ చూశాం. కానీ ఇప్పుడు మరింత దిగజారి పీఠాన్ని పదిలం చేసుకోవడం కోసం తోటి మంత్రుల వ్యక్తిత్వంపై దాడులు చేయిస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాం’ అని పేర్కొంటున్నారు.
ముగ్గురు మంత్రులు టార్గెట్?
రాష్ట్రంలో ఒకేసారి పలువురు మంత్రులపై లైంగిక ఆరోపణలు రావడం హాట్ టాపిక్‌గా మా రింది. దీంతో ముఖ్యనేత ప్లాన్‌పై విపరీతంగా చర్చ జరుగుతున్నది. ప్రధానంగా ముగ్గురు మంత్రులను లక్ష్యంగా చేసుకున్నట్టు సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక మహిళా మంత్రిపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు గుప్పించి, ఆమెను అధిష్ఠానం ముందు అవినీతిపరురాలిగా నిలబెట్టినట్టు చర్చ జరుగుతున్నది. తాజాగా ముఖ్యనేత తన అనుకూలమైన మీడియాతో ఇద్దరు మంత్రులపై తన ప్లాన్ అమలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. మీడియా కథనాలను సాకుగా చూపి వారిని మంత్రివర్గం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నదని ప్రచారం జరుగుతున్నది.
‘తెలంగాణ క్యాబినెట్లో ఒక సీనియర్ మంత్రికి, మహిళా ఐఏఎస్‌కు మధ్య ఏం జరుగుతున్నది? వాళ్లిద్దరి మధ్య ఉన్నది స్నేహమేనా? అంతకుమించి కుచ్కుచ్ హోతాహై ఏమైనా ఉన్నదా?’ అంటూ ముఖ్యనేతకు అత్యంత దగ్గరగా ఉండే మీడియా సంస్థ కథనం ప్రసారం చేయడం రాజకీయ వేడిని పెంచింది. దాదాపు నాలుగు నిమిషాల నిడివిగా సాగిన ఈ స్టోరీతో పరోక్షంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రిని తెరమీదికి తెచ్చారు. ఆయనతో ఓ ఐఏఎస్ అధికారికి సంబంధం అంటగడుతూ కథనం ప్రసారం చేశారు. నిజానికి ఇదే కథనం వారం కిందట వేరే చానల్లో రాగా, ఊహించినంత ప్రచారం దక్కలేదట. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాగా గుర్తింపు ఉన్న చానల్లో ప్రసారం చేయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కథనంలో పేర్కొన్న అంశాలతోపాటు, ‘ఇద్దరినీ విడగొట్టడానికి ఆఫీసర్‌ను బదిలీ చేయడం మినహా ప్రభుత్వ పెద్దలకు మరో మార్గం కనిపించలేదా?’ అంటూ యాంకర్ సంధించిన ప్రశ్నలు ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని బ్యూరోక్రాట్ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
తనపై ఎల్లో మీడియా వ్యూహాత్మక దాడిని గమనించిన సదరు మంత్రి మీడియా ముందుకొచ్చారు. సాధారణంగా ఆయనది ఎదురుదాడి స్వభావం. తనపై లైంగిక ఆరోపణలు చేసిన చానళ్లపై తనదైన శైలిలో ధమ్కీ ఇస్తారని, అంతు చూసేదాకా వదలననేలా హెచ్చరికలు చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇందుకు భిన్నంగా మీడియా ముందు మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆరెండు చానళ్లు సొంతంగా ఈ కథనం ప్రసారం చేసి ఉంటే ఆయన రెచ్చిపోయేవారని, కానీ ఈ కథనాల వెనుక ముఖ్యనేత ఉన్నారనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే తన మాటల్లో ఘాటు తగ్గించినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. నమ్ముకున్న ముఖ్యనేతే వెన్నుపోటు పొడిచారని తీవ్ర నిర్వేదం ఆవహించిందన్నారు. తన కొడుకు చనిపోయిన రోజే సగం సచ్చానని, ఇంకా చాలదనుకుంటే తనకు విషం పెట్టి చంపాలంటూ మంత్రి ఉద్వేగంగా మాట్లాడటం వెనుక మర్మం ఇదేనని చెప్తున్నారు.
నల్లగొండ మంత్రిపై కథనం ప్రసారం చేసిన చానల్లోనే.. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో మరో కథనాన్ని ప్రసారం చేసింది. మహిళా విలేకరులు, మహిళా అధికారులతో ఆయన అనుచితంగా ప్రవర్తించారని అందులో ఆరోపించింది. తనను ప్రేమించాలంటూ సచివాలయంలో విధులు నిర్వహించే ఒక మహిళా జర్నలిస్టును సదరు మంత్రి వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. నిజానికి ముఖ్యనేత ఈ మంత్రిపై ఎప్పటినుంచో కత్తి నూరుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో గతంలోనే చర్చ జరిగింది. దీంతో ముఖ్యనేత తన ప్లాన్‌ను అమలు చేశారని, ఇందులో భాగంగా సహజంగానే ఎల్లో మీడియా అధినేత మొదట ప్రతిస్పందించారని అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు లైంగిక ఆరోపణల కథనాలు ప్రసారం అయ్యాయని విశ్లేషిస్తున్నారు. దీంతో ఇద్దరు మంత్రులపై ఏకకాలంలో ఒకే తరహాలో కథనాలు ప్రసారం కావడం వెనుక ముఖ్యనేత విసిరిన వల ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.