హైదరాబాద్‌కు పశ్చిమాన అత్యంత విలువైన భూముని కబ్జా పెట్టబోయిన బాంబుల మంత్రి కొడుకు ఉదంతం బయటికి వచ్చి 24 గంటలు గడవకముందే నగరానికి ఉత్తరాన మరో ‘భూ’తాల మాయ వెలుగు చూసింది. అమాయకుల భూములను ఎగదన్నుకుపోవడానికి పెద్దలనబడే గద్దలు పాగా వేశాయి. భూమి తనదేనని కాగితాల కట్ట పట్టుకొని సామాన్యుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కులేదు. తమ జాగలోకి తమనే రానివ్వడం లేదంటూ నెత్తీనోరు బాదుకుంటున్నా ‘గోడ’లాంటి వ్యవస్థ గోడు వినట్లేదు. చట్టం పెద్దల చుట్టమైంది. నిబంధనలు బుట్టదాఖలై.. సమస్త వ్యవస్థలూ చట్టుబండలైనయ్! రాజకీయం రౌడీయిజానికి దిగితే.. అధికార బలంతో అక్రమాలకు పాల్పడితే.. ఎలా ఉంటుందో శామీర్‌పేట లియోనియా ఉదంతమే ఉదాహరణగా నిలుస్తున్నది. పోలీసులనూ, కోర్టులనూ.. వేటినీ ఖాతరు చేయని ‘ఖద్దరు రౌడీలు’ కబ్జాపర్వాన్ని దర్జాగా, దౌర్జన్యంగా సాగిస్తుంటే.. బిగ్ బ్రదర్స్, వారి అనుయాయుల సేవలో అధికార యంత్రాంగం తరిస్తున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అధికారం తోడుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు పరాకాష్ట ఇది. ఇప్పటికే విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను గద్దల్లా తన్నుకుపోతూ, ప్రైవేట్ భూములను కబ్జా పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాబందుల మాదిరిగా ఇండ్ల మీద కూడా వాలుతున్నారు. హైదరాబాద్‌కు పశ్చిమాన అత్యంత విలువైన భూముని కబ్జా పెట్టబోయిన బాంబుల మంత్రి కొడుకు ఉదంతం బయటికివచ్చి 24 గంటలు గడవకముందే.. నగరానికి ఉత్తరాన మరో సంచలనం వెలుగు చూసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలో ఖద్దరు రౌడీలు బహిరంగంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కండ్ల ముందు తమ భూమి కబ్జా పాలవుతుంటే సామాన్యుల ఆవేదన అంతాఇంతా కాదు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు ఎవరూ పట్టించుకోకపోవడంతో.. బాధితులు ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించారు. బిగ్‌బ్రదర్స్ కనుసన్నల్లో, ఓ ముఖ్య సలహాదారు నేతృత్వంలో, ఓ కీలకనేత ఆధ్వర్యంలో జరుగుతున్న దాదాపు రూ.వెయ్యి కోట్ల భూముల కబ్జాపై బాధితులు వివరాలు వెల్లడించారు.
ఇదీ నేపథ్యం
లియో మెరిడియన్ రిసార్ట్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2001లో బొమ్మరాశిపేట గ్రామంలో 143.13 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 387, 388, 389, 390, 418, 420, 421లో రైతుల నుంచి భూములను సేకరించింది. సంబంధిత అధికారిక శాఖల నుంచి అనుమతులు తీసుకొని.. దానిని కమర్షియల్ స్థలంగా మార్చుకున్నది. ఇందులో 66.28 ఎకరాల్లో భవనాలు, రాక్ గార్డెన్, ఫుడ్‌కోర్టు, ఫంక్షన్‌హాల్, వాటర్ పార్కు, థియేటర్, లైసీ బ్లాక్‌లను నిర్మించి.. లియో మెరిడియన్ రిసార్ట్ పేరుతో నడిపిస్తున్నారు. లియోనియా రిసార్ట్స్ పేరుతో రియల్ఎస్టేట్ రంగంలో ఇది ప్రాచుర్యం పొందింది. సర్వే నంబర్ 430, 414ల్లోని దాదాపు 20 ఎకరాల భూమిని పార్కింగ్ స్థలంగా ఉంచారు. మిగతా 55.13 ఎకరాలను 2002లో 305 ప్లాట్లుగా చేసి విక్రయించినట్టు కంపెనీ అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ 23 ఏండ్లలో కొందరు అక్కడ భవనాలు కట్టుకొని నివాసం ఉంటుండగా, మరికొందరు అమ్ముకున్నారు. ఇంకొందరు తమ ప్లాట్ల చుట్టూ ప్రహరీ నిర్మించి, గేట్లు పెట్టుకొని రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు బ్యాంకుల్లో కుదువబెట్టి లోన్లు తీసుకున్నారు.

అమ్మిన ప్లాట్లు ‘లియో’ ఆస్తులు కాదు!
లియో మెరిడియన్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేర్వేరు బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్టు నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిర్ధారించింది. 2019లో దివాలా కంపెనీగా ప్రకటించి, దానికి సంబంధించిన ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకున్నది. దీంతో అదే ఏడాది ఏప్రిల్‌లో కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెన్ (సీఐఆర్‌పీ) ప్రారంభమైంది. దివాలా కంపెనీకి సంబంధించిన ఆస్తులను వేలం వేయాలని, వచ్చిన డబ్బును రుణదాత బ్యాంకర్లకు పంచాలని ఎన్సీఎల్టీ నిర్ణయించింది. ఈ మేరకు రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ కలిసి ముంబైకి చెందిన దేవేంద్రప్రసాద్ అనే వ్యక్తిని రెజల్యూషన్ ప్రొఫెషనల్‌గా ఎంపిక చేశాయి. కంపెనీకి సంబంధించిన లావాదేవీల వ్యవహారానికి ఆయన అధికార ప్రతినిధి అన్నమాట. ఆయన అధ్యయనం చేసి ఎన్సీఎల్టీ ఇచ్చిన నివేదికలో 55.13 ఎకరాల్లో ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన ప్లాట్లను బ్యాంకుల కన్సార్షియంకు తనఖా పెట్టలేదని, అవి లియో మెరిడియన్ కంపెనీలో భాగం కాదని తేల్చి చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఈ ప్లాట్లలో సీఐఆర్‌పీ ఎటువంటి జోక్యం చేసుకోదని కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించారు. ఇదే విషయాన్ని 2024 అక్టోబర్ 7వ తేదీన జరిగిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ సమావేశంలోనూ స్పష్టంచేశారు. దీంతో లియో రిసార్ట్ భూములను స్వాధీనం చేసుకునే దగ్గర నుంచి వేలం వేసే వరకు ఎన్సీఎల్టీ ఎక్కడా ప్రైవేట్ ప్లాట్ల జోలికి వెళ్లలేదు.
ఆ ఆస్తులపై బిగ్‌బ్రదర్స్ కన్ను
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లియో మెరిడియన్ ఆస్తులపై బిగ్‌బ్రదర్స్ కన్నేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యనేతకు అతి చనువుగా ఉండి, ముఖ్య సలహాదారుగా ఉన్న వ్యక్తి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించినట్టు చెప్తున్నారు. 66.28 ఎకరాల కంపెనీ భూములు, ఆస్తులతోపాటు 55.13 ఎకరాల్లో విస్తరించి ఉన్న సామాన్య ప్రజల ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు పన్నినట్టు చర్చ జరుగుతున్నది. రూ.వేల కోట్ల విలువైన ఆస్తులను కారుచౌకగా కొట్టేయడానికి ప్రణాళికలు వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అధికార పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయిన ఓ మాజీ ఎంపీతో అజ్ఞాత పెట్టుబడి పెట్టించి, మరో బినామీని తెర మీద బొమ్మగా నిలబెట్టి వ్యవహారం చక్కదిద్దినట్టు సమాచారం.
వ్యాపారవేత్త కూడా అయిన సదరు మాజీ ఎంపీ.. బ్యాంకు కన్సార్షియం పిలిచిన బిడ్డింగ్‌లో బినామీ వ్యక్తి తన కంపెనీ పేరుతో బిడ్డింగ్ వేసి, లియో మెరిడియన్ ఆస్తులను కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో బినామీ పేరు మీదికి ఆస్తులను మారుస్తూ ఎన్సీఎల్టీ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. 66.28 ఎకరాలలోని భవనాలు, రాక్‌గార్డెన్, ఫుడ్‌కోర్టు, హాల్, వాటర్పార్కు, థియేటర్, లైసీబ్లాక్లు బినామీ ఆధీనంలోకి వచ్చాయి. 2002లో లియో మెరిడియన్ చేసిన వెంచర్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఐదారు ప్లాట్లు కూడా నిబంధనల మేరకు బినామీ కంపెనీకే చెందాయి. ఈ నిబంధనను అడ్డంపెట్టుకొని షాడో హోంమంత్రిగా పేరున్న ఓ ముఖ్యసలహాదారు తోడ్పాటుతో మాజీ ఎంపీ మొత్తం 143.13 ఎకరాల భూమితోపాటు పక్కనే ఉన్న రైతులకు చెందిన 20 ఎకరాల భూమిని కబ్జా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
శవాలు కూడా దొరుకవు
లియో రిసార్ట్ ఆవరణలో మొత్తం 300కుపైగా ప్లాట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువవరకు 1,000 గజాల ప్లాట్లే ఉన్నాయి. ఒక్కో ప్లాటు విలువ సగటున రూ.3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ లెక్కన మొత్తం ప్లాట్ల విలువ రూ.900 కోట్ల నుంచి-వెయ్యి కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్లాట్ల నుంచి అసలైన ఓనర్లను వెళ్లగొట్టి, వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముందుగా రిసార్ట్‌లోని మొత్తం భూమిని తమ ఆధీనంలో తీసుకున్నారు. సింగిల్ గేటు ద్వారా మాత్రమే ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఒకే మెయిన్ గేట్ ఏర్పాటు చేసి, అక్కడ 30 నుంచి 40 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు. తద్వారా స్వేచ్ఛగా లోనికి, బయటికి రాకుండా నిర్బంధిస్తున్నారని ప్లాట్ల ఓనర్లు వాపోతున్నారు. అప్రోచ్ రోడ్లను ధ్వంసం చేస్తున్నారని, రాకపోకలు అడ్డుకోవడానికి నడి రోడ్లపై మట్టికుప్పలు పోస్తున్నారని ఆరోపిస్తున్నారు. అప్రోచ్ రోడ్ల లింక్ వద్ద కూడా గేట్లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు చెప్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ప్లాట్ల ఆవరణలోని రోడ్ల మీద కర్రలు పట్టుకొని తిరుగుతున్నారని చెప్పారు.
దీంతో పలువురు ప్లాట్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాట్ గేట్లకు ఎదురుగా టిప్పర్ల ద్వారా మట్టికుప్పలు పోసి ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాత్రిపూట తలుపులు కొడుతూ, అసభ్యకరమైన పదజాలంతో తిడుతున్నారని, ప్లాట్లు వదిలి వెళ్లకపోతే శవాలు కూడా దొరుకకుండా చేస్తామని బెదిరిస్తున్నట్టు బాధితుడు వై ప్రమోద్‌గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 100కు డయల్ చేసి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇస్తే, మరింతమంది గూండాలు వచ్చి బెదిరిస్తున్నారని 404 ప్లాట్ ఓనర్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తే ‘మాపై పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టడానికి మీకెంత ధైర్యం? మేమేంటో చూపిస్తాం! మమ్మల్ని ఆపడానికి ధైర్యం చేస్తే.. మీలో ఎవరూ రేపు కనిపించరు!’ అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగినట్టు మరో ప్లాట్ ఓనర్ సరస్వతి ఆవేదన వ్యక్తంచేశారు. తమపై శారీరక, మానసిక వేధింపులను నియంత్రించాలని, తమ ప్లాట్లలో చట్టవిరుద్ధమైన నిర్మాణ ప్రయత్నాలు అడ్డుకోవాలని భాస్కర్‌రాజు, సీతామహాలక్ష్మి తదితరులు వ్యక్తిగతంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్టేషన్లలో రౌడీలకు మర్యాదలు
పోలీసులు, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడంతో బాధితులు ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ముఖ్యనేత కీలక సలహాదారు అండతో జరుగుతున్న అరాచకాలను వివరించారు. తాము పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే చేతులు కట్టుకొని నిలబడ్డామని, కానీ రౌడీలు మాత్రం దర్జాగా కుర్చీల్లో కూర్చొని తమనే బెదిరించారని బాధితులు వాపోయారు. ‘మిమ్మల్ని ప్లాట్ల నుంచి పంపించకుండా ఎవరూ ఆపలేరు’ అని పోలీస్ స్టేషన్లోనే బహిరంగంగా బెదిరింపులకు దిగారని చెప్పారు. సూపర్ కాప్‌గా పేరున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిని కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసుల్లో కొద్దిగా చలనం వచ్చిందని తెలిపారు. తమ ఫిర్యాదులు స్వీకరించి, కేసులు నమోదు చేశారని వివరించారు. అయినా ప్రయోజనం లేదని, వారి దౌర్జన్యాలు ఆగడం లేదని వాపోయారు. ఇప్పటివరకు ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, కానీ తదుపరి విచారణ చేయడంలేదని ఆరోపిస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదైనా కబ్జాదారులు తమ ఆస్తిలోకి పదే పదే చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కష్టార్జితాన్ని కబ్జాదారుల పాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
తొక్కని గడప లేదు..మొక్కని నేత లేడు
తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తులపై పెద్దల దౌర్జన్యాలను నిలువరించాలని తొక్కని గడప లేదు, మొక్కని నేత లేడని బాధితులు వాపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పెద్ద నేతను కలిసి, అధికారిక పత్రాలు చూపెట్టి, సాయం చేయాలని అర్థించగా.. ఆయన అటూ ఇటూ ఫోన్లు చేసి, చివరికి తనతో కాదని చేతులు ఎత్తేసినట్టు వారు వాపోయారు. స్థానిక ఎంపీని కలిసి తమ కష్టాలన్నీ చెప్పుకొని కాపాడాలని కన్నీళ్లు పెట్టుకుంటే, ఆయన కూడా చూద్దామని చెప్పి పంపించేశాడని ఆవేదన వ్యక్తంచేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేను కలిస్తే.. ఆయన కూడా తప్పుకున్నట్టు తెలిపారు. వాస్తవానికి ఈ దౌర్జాన్యాన్ని ఆపాల్సింది పోలీసులే. కానీ, లియో రిసార్ట్ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నది షాడో పోలీసు బాస్‌గా గుర్తింపు ఉన్న కీలకనేత కావడంతో పోలీసులెవరూ సహకరించడం లేదు. బాధితులు ఎస్ఐ నుంచి డీసీపీ స్థాయి అధికారి వరకు కనబడిన ప్రతి ఒక్కరినీ కలిసి వేడుకున్నా ఫలితం లేకపోయింది.