హైదరాబాద్ సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్/జహీరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో బీదర్‌కు చెందిన ఇద్దరు దొంగలు తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. కాల్పుల్లో గాయపడ్డ బస్సు డ్రైవర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బీదర్‌లోని శివాజీ చౌక్‌లో గురువారం ఉదయం ఏటీఎం కేంద్రంలో నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న సెక్యూరిటి సిబ్బందిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి, వారి దగ్గర నుంచి రూ.93 లక్షలు లాక్కుని పరారయ్యారు.
కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు, మరో వ్యక్తి మృతి చెందారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ వచ్చిన దుండగులు 3 గంటల పాటు అఫ్జల్‌గంజ్‌లో తలదాచుకున్నారు. రాయచూర్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 7 గంటలకు ట్రావెల్స్ బస్ బోయిన్పల్లి నుంచి బయల్దేరాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో అఫ్జల్‌గంజ్ నుంచి సాయంత్రం 6 గంటలకు ట్రావెల్స్ మినీబస్సులో ఎక్కారు. ఈ క్రమంలో బ్యాగును పైన పెట్టేందుకు బస్ డ్రైవర్ ప్రయత్నించాడు. బ్యాగు చాలా బరువుగా ఉండటంతో అనుమానం వచ్చి చూడగా అందులో నగదు గుర్తించాడు. ఇంతలో ఇద్దరు దొంగల్లో ఒకడు తన దగ్గర ఉన్న గన్ తీసుకుని కాల్పులు జరిపాడు. ఆ తర్వాత వారిలో ఒకరు పోలీసులకు పట్టుబడి నట్టు సమాచారం. మరో వ్యక్తిని పట్టుకునేందుకు బీదర్‌తో పాటు రాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేస్తున్నారు.