ఓ విజన్.. ప్లానింగ్.. ఇంప్లిమెంటేషన్.. ఇదీ గత బీఆర్ఎస్ పాలనలోని భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి. పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో భువనగిరిలో నిధులు వరద పారింది. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రగతి పరుగులు పెట్టింది. వేలాది కోట్ల నిధులతో పట్టణ ముఖచిత్రమే మారిపోయింది. వాడవాడల్లో.. వీధివీధిలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోయింది. కాగా రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో భువనగిరి అధోగతి పాలైంది. అభివృద్ధిలో నక్కకు నాగలోగానికి ఉన్నతేడా ఉంది. కాంగ్రెస్‌ను గెలిపించి ఎంత నష్టపోయామో అని పట్టణ ప్రజలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రాజధానికి అతి చేరువలో ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో భువనగిరి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మౌలిక సదుపాయాలు కల్పించిన నాథుడేలేడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టడం.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి మున్సిపాలిటీ ఉండటంతో పట్టణాభివృద్ధిపై నాటి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉంచారు. కేసీఆర్, కేటీఆర్‌ను ప్రత్యేకంగా కలిసి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చారు. మున్సిపాలిటీలో సుమారు రూ. 2వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. మున్సిపల్ బిల్డింగ్, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వరద నీటి కాల్వలు, సెంట్రల్ లైటింగ్, లేయింగ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులతోపాటు మరెన్నో పనులు చేపట్టారు.
పట్టణంలోని రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. గతుకులతో ఉన్న రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్ల దుస్థితిని శేఖర్ రెడ్డి అప్పటి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో పెద్దమొత్తంలో నిధులు విడుదలయ్యాయి. ఒకప్పుడు ఇరుకుగా ఉన్న భువనగిరి ప్రధాన రహదారిని విస్తరించారు. దీంతో రహదారులు హరితశోభను సంతరించుకున్నాయి. గల్లీగల్లీకి సీసీ రోడ్లు నిర్మించారు. వార్డుల్లో అక్కడక్కడా మట్టి రోడ్లు ఉన్న ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లకు శ్రీకారం చుట్టారు. అర్బన్ కాలనీ, కిసాన్ నగర్, సమ్మద్ చౌరస్తా రోడ్లతో ఆ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి.
భువనగిరి పరిధిలో ఎన్నో కొత్త భవనాలకు శ్రీకారం చుట్టారు. రాయగిరి వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.53.20 కోట్లతో అత్యాధునిక హంగులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మించారు. పట్టణంలో 1815 గజాల్లో రూ.2కోట్లతో అన్ని హంగులతో కూడిన కొత్త గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. హైదరాబాద్ చౌరస్తా సమీపంలో రూ.46 లక్షలతో నూతనంగా నిరాశ్రయుల భవనాన్ని నిర్మించారు. రూ.1.60 కోట్లతో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న 60 స్టాల్స్‌ను 120కి పెంచారు. ఇక మిషన్ భగీరథ పైపులైన్ కోసం రూ.22.16 కోట్లు ఖర్చు చేశారు. రూ.4 కోట్లతో పెద్దచెరువును మినీ ట్యాంకు బండ్‌గా ఏర్పాటు చేశారు. కందకంతోపాటు జూనియర్ కళాశాల మైదానాన్ని అద్భుతంగా తయారు చేశారు.

భువనగిరి పట్టణాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దారు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరైంది. ఏరియా దవాఖానలో ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇందులో డయాలసిస్ రోగులకు అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటుతో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. పట్టణంలోని తారకరామానగర్, రెడ్డివాడ, సంజీవనగర్‌లో రూ.33 లక్షలతో అధునాతన బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రూ.56లక్షలతో హోమియోపతి ఆస్పత్రి భవనం ఏర్పాటు చేశారు. ఇందులోనే న్యూబార్న్ బేబీ కేర్ యూనిట్, పిడియాట్రిక్ వార్డులను అందుబాటులోకి తెచ్చారు. అంతే కాకుండా మాతా శిశు వార్డు, పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. రోగులకు ఉచిత ఫిజియో థెరపీ, మానసిక రోగుల కోసం సైక్రియాట్రిక్ సెంటర్‌ను ప్రారంభించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా భువనగిరి మున్సిపాలిటీకి ఒరిగిందేమీ లేదు. కనీసం నిధులు మంజూరు చేయించుకోలేని దుస్థితి. అనేక చోట్ల బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులతో పనులు కొనసాగుతున్నాయి. రాయగిరి వద్ద మల్టీ పర్పస్ స్పోర్ట్స్ స్టేడియం ప్రకటనలకే పరిమితమైంది. పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. ఐటీ టవర్లు ఏర్పాటు చేస్తామని ఊదరగొట్టినా అడుగు ముందుకు పడలేదు. ఇందిరమ్మ కాలనీకి పైపులైన్ ద్వారా కనీసం నీటి సదుపాయం కల్పించలేని దుస్థితి నెలకొంది.
బీఆర్ఎస్ హయాంలో అనేక భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. చిన్న చిన్న పనులు పూర్తి చేసి, ప్రారంభించే అవకాశం ఉన్నా బీఆర్ఎస్కు పేరొస్తుందనే భయంతో గాలికొదిలేశారు. భువనగిరి పట్టణంలో 444 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలేదు. భువనగిరి పట్టణంలో రూ.8.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించారు. ఒకే చోట కూరగాయలు, ఆకు కూరలు, చేపలు, మటన్, చికెన్, నిత్యావసర సరుకులు దొరికేలా ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా రెండేండ్లుగా పట్టించుకోవడంలేదు. అంబేద్కర్ భవనం చివరి దశలో ఉన్నప్పటికీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో నీతి, నిజాయతీతో పనిచేశాం. ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. రాత్రింబవళ్లూ కష్టపడ్డాం. వాడవాడలా రోడ్లు వేయించాం. ప్రస్తుత ప్రభుత్వం రోడ్లు వేద్దామన్నా జాగా లేనంతలా రోడ్లు నిర్మించాం. వేల కోట్లు ఖర్చు చేసి అద్దంలా తీర్చిదిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా..? కనీసం నిధులు మంజూరు చేయించుకోలేని దుస్థితి. మేం చేసిన అభివృద్ధి పనులే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తాయి.