గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుగా మేము అంగీకరించబోం.. గోదావరిలో ఏపీకే అత్యధిక వాటా దక్కుతుంది. ఆ మేరకే ప్రాజెక్టులు రూపొందించు కుంటున్నం. ఆంధ్రప్రదేశ్ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చినప్పుడు లేని వివా దం, ఇప్పుడు బనకచర్ల, నల్లమల సాగర్ విషయంలో ఎందుకు?
-ఢిల్లీలో శుక్రవారం సీడబ్ల్యూసీ సమక్షంలో జరిగిన ఏపీ-తెలంగాణ జల వివాదాల కమిటీ భేటీలో ఆంధ్రా అడ్డగోలు వాదన!
వృథాగా సముద్రంలోకి పోయే జలాలనే ఏపీ వినియోగించుకుంటే తప్పేమిటి? ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు కట్టి నీటిని వాడుకుంటే కింద రాష్ర్టాలకు నష్టం కానీ, ఏపీ తర్వాత ఏ రాష్ట్రం లేదు కదా? వరద జలాలను వాడుకుంటే తప్పేమున్నది? దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ నల్లమలసాగర్ ప్రాజెక్టు చేపడితే తెలంగాణకు వచ్చే నష్టమేంటి?
– ఆంధ్రా సర్కార్‌కు సీడబ్ల్యూసీ చైర్మన్ వత్తాసు
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, చనాక కొరాట, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులేవీ తాము అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి, రివర్ బోర్డులకు తెలియజేశామని వాదించింది. గోదావరి నదీ జలాల్లో తమకే 850 టీఎంసీలు దక్కుతాయని, అందుకు అనుగుణంగానే ప్రాజెక్టులను రూపొందించుకుంటున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కొనసాగిన నిపుణుల కమిటీలో నివేదించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది అధికారులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక నిపుణుల కమిటీ కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం తొలిసారి భేటీ అయింది.
ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశానికి ఇరు రాష్ర్టాల అధికారులు, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, పలు కేంద్ర సంస్థల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఏపీ సర్కార్ తమ ఎజెండాను పీపీటీ రూపంలో ప్రదర్శించినట్టు విశ్వసనీయ సమాచారం. ఏపీ ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు పీపీటీ ఇ చ్చినట్టు తెలిసింది. గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుగా తాము అంగీకరించబోమని, ఏపీకే 850 టీఎంసీలకుపైగా వాటా దక్కుతుందని ఏపీ వాదించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన తరువాత చేపట్టిన కాళేశ్వరం, చనాక కొరాట, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల అనుమతులను సైతం అంగీకరించబోమని ఏపీ తెగేసి చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికే అ నేక పర్యాయాలు కేంద్రానికి, రివర్ బోర్డులకు సైతం వివరించామని, లేఖల ద్వారా ఫిర్యాదు చేశామని కూడా చెప్పినట్టు సమాచారం.
గోదావరిలో ఏపీకే అత్యధిక వాటా దక్కుతుందని, ఆ మేరకే ప్రా జెక్టులను రూపొందించుకుంటున్నామని వివరించినట్టు తెలిసింది. పోలవరం ఎగువ రాష్ట్రాలు వారి హకుల ప్రకారం వినియోగించుకున్న తర్వాతే, పోలవరం నుంచి సముద్రంలో వృథాగా కలిసిపో యే జలాలతోనే నల్లమలసాగర్ రూపొందించామ ని ఏపీ మరోసారి తేల్చిచెప్పడమే గాక, ఏపీ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చినప్పుడు లేని వివాదం, ఇ ప్పుడు బనకచర్ల/నల్లమలసాగర్ విషయంలో ఎందుకని ఏపీ ఎదురు ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, కృష్ణా జలాల్లో ప్రస్తుత కేటాయింపులు 66:34 నిష్పత్తికి బదులుగా 50:50 నిష్పత్తిలో పంచడం కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకమని, అది సాధ్యం కాదని తెగేసి చెప్పినట్టు తెలుస్తున్నది.
భేటీలో ఏపీ అడ్డదిడ్డమైన వాదనలు చేస్తుంటే, తెలంగాణ అధికారులు చోద్యం చూసినట్టు సమాచారం. ఢిల్లీ భేటీ కోసం తెలంగాణ సర్కార్ ఎ లాంటి ఎజెండానూ రూపొందించుకోలేదు. ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్‌దాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ సమావేశానికి తరలివెళ్లారు. ఎజెండాను సమర్పించకపోవడంతో నేరుగా ఆయా జల వివాదాల అంశాలను స్వయంగా వివరించాలని తెలంగాణ అధికారులకు సీడబ్ల్యూసీ చైర్మన్ సూచించిన ట్టు తెలిసింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతూ.. పోలవరం-నల్లమలసాగర్ పై ఎలాంటి చర్చలూ చేపట్టేందుకు వీల్లేదని, ఎజెండాలో పెడితే చర్చలకు వచ్చేది లేదని స్పష్టంచేసిన ట్టు సమాచారం. కృష్ణా జలాలకు సంబంధించి, గో దావరి బేసిన్లో పలు ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి 12 జల వివాద అంశాలను నివేదించారు. సమావేశానంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ రా హుల్ బొజ్జా మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రాల మధ్య నీటి వాటాలను పకాగా తేల్చాల్సిందేనని, ట్రిబ్యునల్ తీర్పు వచ్చే దాకా బచావత్ కేటాయింపుల్లో సగం వాటా తెలంగాణకు ఇవ్వాలని, కృష్ణా డెఫిసిట్ బేసిన్ అని, అక్రమ నీటి మళ్లింపులను ఆపాలని, విభజన తరువాత ఏపీ పలు ప్రాజెక్టులను చేపట్టిందని, వాటిపైనా చర్చించాలని కోరినట్టు వివరించారు.
భేటీలో తొలుత ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, నీటి కేటాయింపులు, 12 ఏండ్లలో రెండు రాష్ట్రాల వినియోగాలపై సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు కూడా టెలిమెట్రీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. అనంతరం ఇరు రాష్ర్టాల వాదనలు విన్న తరువాత సీడబ్ల్యూసీ మరోసారి స్పందించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ వాదనలకే సీడబ్ల్యూ సీ వత్తాసు పలికినట్టు సమాచారం. వృథాగా సముద్రంలోకి పోయే జలాలనే ఏపీ వినియోగించుకుం టే తప్పేమిటని ఏపీ తరహాలోనే తెలంగాణ ప్రతినిధులను సీడబ్ల్యూసీ చైర్మన్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు కట్టి నీటిని వాడుకుంటే కింది రాష్ట్రాలకు నష్టం కానీ, ఏపీ తర్వాత ఏ రాష్ట్రం లేదు కదా? వరద జలాలను వాడుకుంటే తప్పేమిటని సీడబ్ల్యూసీ ఛైర్మన్ అడిగినట్టు సమాచారం.
దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ నల్లమలసాగర్ ప్రాజెక్టును చేపడితే తెలంగాణకు నష్టమేంటని అడిగినట్టు తెలిసింది. అంతేకాదు, గోదావరి జలాల వి నియోగంపై కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల ని ఏపీ కోరగా, ఒకసారి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే 10, 20 ఏండ్ల దాకా సమయం తీసుకుంటుందని, అందుకని ఇరు రాష్ర్టాలు మాట్లాడుకుని పరిషరించుకుంటే మంచిదని సీడబ్ల్యూసీ చైర్మన్ ఉచిత సల హా ఇవ్వడం కొసమెరుపు. అందుకు తాము సిద్ధంగానే ఉన్నట్టు ఏపీ చెప్పగా, ముందుగా రెండు రా ష్ట్రాలు వారం రోజుల్లోగా ఎజెండా అంశాలు సమర్పించాలని, ఆ తర్వాత అన్ని విషయాలు సవివరంగా చర్చిద్దామని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. అటు తరువాత అంశాలను ఇరు రాష్ర్టాలకు పంపి, సమ్మతించిన అంశాలతో ఎజెండాను ఖరారు చేస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ వెల్లడించినట్టు తెలిసింది.
15 రోజుల తరువాత మరోసారి కమిటీ సమావేశముంటుందని ఈ సందర్భంగా తెలిపినట్టు సమాచారం. ఇదిలాఉంటే, సమావేశం అనంతరం ఏపీ నే ఎజెండాను సమర్పించలేదని తెలంగాణ, కాదు తెలంగాణనే ఎజెండాను సమర్పించలేని ఏపీ స ర్కార్ పరస్పర ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. సమావేశం ఎజెండాను వారం రోజుల ముందే పంపినట్టు సీడబ్ల్యూసీ ఛైర్మన్‌కి ఏపీ అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. కానీ, తెలంగాణ ప్రతినిధులు మాత్రం ఏపీ ఎజెండానే సమర్పించలేదని పేర్కొనడం కొసమెరుపు. మరోవైపు, ప్రస్తుత మీటింగ్ కేవలం ఎజెండా తయారు చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు, ఏపీ మాత్రం పీపీటీ ప్రదర్శించింది. మొత్తంగా గోదావరి జలాలకు ఎసరు పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ ఎ త్తులు వేసినట్టు స్పష్టమవుతున్నది. సమావేశంలో ఏపీ సర్కార్ వాదనలే అందుకు నిదర్శనం. గోదావరి నీటి వాటాలను సైతం పూర్తిగా తిరగేసేందుకు ఎత్తులు వేస్తున్నదని స్పష్టంగా తెలిసిపోతున్నది.