నారాయణఖేడ్, ఆగస్టు 4: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని కోరుతూ సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో లబ్ధిదారులతో కలిసి స్థానిక సబ్ కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం నారాయణఖేడ్ నియోజకవర్గానికి 1,400 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయగా పిప్రి, నిజాంపేట్, పెద్దశంకరంపేట, బల్కంచెల్క తండాలో మొత్తం 350 డబుల్ ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయగా పట్టణ సమీపంలోని జూకల్ శివారులో రూ.55 కోట్లు వెచ్చించి 795 ఇండ్లు నిర్మించడం జరిగిందని అన్నారు.
అప్పట్లో పూర్తి పారదర్శకంగా లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు చెప్పారు. తుది దశ పనులు పూర్తి చేసి వారికి పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో కుదరలేదని పేర్కొన్నారు. తమ హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయకపోతే బీఆర్ఎస్ లబ్ధిదారుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తాను అవినీతికి పాల్పడినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఒక వేళ నిరూపించకపోతే క్షమాపణ చెప్పి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్యాలని భూపాల్‌రెడ్డి సవాల్ విసిరారు.