నారాయణఖేడ్/కల్హేర్, మార్చి 31: సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వీరాభిమాని, బీఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తచెరువుతండాకు చెందిన హరిసింగ్(50)కు తండాలో సొంత ఇల్లు కూడా లేని స్థితిలో కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరిసింగ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఆదివారం ఉగాది సందర్భంగా కల్హేర్‌లో పంచాంగ శ్రవణానికకి వెళ్లిన హరిసింగ్ తిరిగి ఇంటికి రాలేదు. సోమవారం ఉదయం నీలంవాగు సమీపంలో శవమై కనిపించాడు.
సమాచారం అందుకున్న సిర్గాపూర్ ఎస్సై వెంకట్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరి విచారణ చేపట్టారు. హరిసింగ్ మెడకు టవల్ బిగించి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు డాగ్ స్కాడ్‌తో తనిఖీలు చేపట్టగా జాగిలం మృతదేహం నుంచి కొద్ది దూరం వరకు వెళ్లి ఆగిపోయింది. కల్హేర్‌లో సీసీ ఫుటేజీలను సేకరించి వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
హరిసింగ్ బీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరించేవాడని తండావాసులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపేవాడని పేర్కొంటున్నారు. భూపాల్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వాదించేవాడని చెప్తున్నారు. ఈక్రమంలో హరిసింగ్ హత్యకు రాజకీయ కారణాలు ఉండవచ్చనే సందేహాలు తలెత్తుతున్నాయి.
హరిసింగ్ హత్య విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరిసింగ్ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఇది పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. గతంలో సిర్గాపూర్ మండలంలోనూ బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన విషయాన్ని గుర్తుచేశారు. హరిసింగ్ హత్యకు బాధ్యులైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఇది మంచిది కాదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కక్షసాధింపు, హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని స్పష్టంచేశారు.