హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం జూన్ 7న ఉదయం శాస్ర్తోక్తంగా భూమి పూజ జరుగనున్నది. బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి భూమి పూజ నిర్వహించనున్నారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి 10 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో దాదాపు రూ.100 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించటానికి రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భూమిపూజ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొననున్నారు.
జమ్మూలో ఆగమోక్తంగా క్షీరాధివాసం
జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి నది ఒడ్డున టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఆగమోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా బింబశుద్ధి కోసం క్షీరాధివాసం చేపట్టారు. శ్రీవేంకటేశ్వరస్వామి, పద్మావతి, గోదాదేవి, గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలకు గోవుపాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ విమాన గోపురం, ధ్వజస్తంభాలను అద్దంలో చూపి పాలతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరు వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్ రామకృష్ణదీక్షితులు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్రెడ్డి, శివప్రసాద్, ఈఈ సుధాకర్, డిప్యూటీ ఈఈలు రఘవర్మ, చెంగల్రాయలు, ఏఈవో కృష్ణారావు, ఏఈ సీతారామరాజు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.