జనగామ, మే 7(నమస్తే తెలంగాణ) : అధికార కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరుల ఆ గడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ భూక్రయవిక్రయాలు జరిగినా కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని తాము ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరులమంటూ అటు భూములు అమ్మిన వారిని.. ఇటు కొనుగోలు చేసిన వారిని బెదిరిస్తూ అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాట వినకుండా స్లాట్ బుక్ చేసుకుంటే ఎమ్మెల్యే పీఏ రాకేశ్ ద్వారా తహసీల్దార్లపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్లు అడ్డుకోవడం, లేదంటే అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన దాయాదులను (అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లను) ఉసిగొల్పి పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టించి భయాందోళనకు గురిచేస్తున్నట్టు సమాచారం.
ఇవేకాకుండా నియోజకవర్గ పరిధిలోని అటు వరంగల్ హైవేలో రఘునాథపల్లి నుంచి చిల్పూరు వరకు.. ఇటు సూర్యాపేట హైవేలో నెల్లుట్ల నుంచి లింగాలఘనపురం, వడిచర్ల వరకు ఎలాంటి భూములు అ మ్మినా, కొనుగోలు చేసినా ఆయా పరిధిలోని కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యే అనుచరులమంటూ అటు అమ్మకందారులు, ఇటు కొనుగోలుదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం పనిగా పెట్టుకొన్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి. వెంకటాద్రిపేటకు చెందిన ఓ రై తు 2.12 ఎకరాలను విక్రయించే క్రమంలోనూ ఓ కాంగ్రెస్ నాయకుడు జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. ఇందులో తనకు 20 గుంటల భూమి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. చుట్టుపక్కల ఏ గ్రామంలోనైనా భూముల క్రయవిక్రయాలు జరిగితే సదరు నాయకుడు జోక్యం చేసుకొని శ్రీహరి పీఏ రాకేశ్‌తో ఫోన్ చేయించి పనులు ఆపాలని ఒత్తిడి చేయిస్తున్నట్టు తెలుస్తున్నది.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఓ పక్క ఎమ్మెల్యే కడియం అనుచరులపై భూదందా ఆరోపణలు వస్తుండగా.. మరో పక్క ఆయన పీఏ రాకేశ్ అక్రమా లు, బెదిరింపులు, ప్రభుత్వ అధికారులపై తెస్తున్న ఒత్తిడిపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. అక్రమ వసూళ్ల పేరుతో నియోజకవర్గ ప్రజలను రాకేశ్ పీడించడం సహా ఎవరైనా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎకరానికి కొంత చొప్పు న ఇవ్వాలని ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నట్టు సమాచారం. సొంత బాబాయికి భూమి అమ్మాలనుకున్న ఓ ఎన్నారై మహిళను వేధిస్తూ ఐదు నెలలు గా తహసీల్ద్దార్పై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపినట్టు తెలిసింది. సదరు వ్యవహారంలో తనకు 10గుంటలు రాసివ్వాలని లేకపోతే భూమి రిజిస్ట్రేషన్ ఆపేస్తానని పీఏ రాకేశ్ సదరు మహిళను, భూమి కొనుగోలు చేసే వ్యక్తిని బెదిరించినట్టు సమాచారం.