ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10 : భూదాన్‌బోర్డు నకిలీ సర్టిఫికెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రామకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లికి చెందిన శ్రీశైలం, యాచా రం మండలం మొండిగౌరెల్లికి చెందిన లింగయ్య ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఇబ్రహీంపట్నం, మం చాల, యాచారం మండలాల్లో భూదాన్‌బోర్డు భూములు ఉన్నాయి. లక్షరూపాయలు ఇస్తే రెండు నుంచి ఐదెకరాల వరకు పాత తేదీల్లో భూదాన్‌బోర్డు సర్టిఫికెట్లు ఇస్తామని పలువురికి ఆశచూపారు.
గతంలో ఇచ్చిన భూదాన్‌బోర్డు సర్టిఫికెట్ నామూనాను తయారుచేసి ఆ సర్టిఫికెట్లో ఇతరుల పేర్లు రాసి.. లక్ష రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే వస్తున్నాయన్న ఆలోచనతో పలువురు వీరిని ఆశ్రయించి సర్టిఫికెట్లు కొనుగోలు చేశారు. వీరిలో కొందరు ఎస్వోటీ పోలీసులను ఆశ్రయించగా, వారు రంగంలోకి దిగి శ్రీశైలం, లింగయ్యలను అదుపులోకి తీసుకుని విచారించారు. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి, ఇప్పటివరకు ఆరుగురికి విక్రయించినట్టు వారు చెప్పారు. ఈ ముఠా నుంచి నకిలీ భూదాన్‌బోర్డు సర్టిఫికెట్లతోపాటు కంప్యూటర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు.