యాదాద్రి, అక్టోబర్ 26: యుగాల నాటి ప్రాచీన స్వయంభూ నారసింహస్వామివారి దేవాలయాన్ని ఆధునిక కాలంలో ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించడం గొప్ప విషయమని భువనేశ్వరి పీఠాధిపతి కమలానందభారతీ స్వామీజీ కొనియాడారు. సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో యాదాద్రి ఆలయాన్ని ఆగమశాస్త్రరీతిలో పునర్నిర్మించిన తీరు అత్యద్భుతమన్నారు. కార్తీకమాసం తొలిరోజైన బుధవారం ఆయన యాదగిరిగుట్ట స్వయంభూ లక్ష్మీనారసింహుడిని దర్శించుకొని పూజలు చేశారు.
అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. తెలంగాణ ప్రాంత భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్న యాదగిరిగుట్ట దేవాలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించారని కితాబునిచ్చారు. ప్రాచీన శిల్పకళ, వాస్తు, శిల్పశాస్ర్తాన్ని ఔపోసన పట్టి అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆలయ వెలుపల మాడ వీధులు, ఎత్తయిన స్తంభాలు, ఎత్తయిన దేవతామూర్తుల రూపాలతో ఆలయం తెలంగాణ రాష్ర్టానికి కలికితురాయిగా నిలుస్తున్నదన్నారు.