Bhu Bharati | జనగామ, జనవరి 11(నమస్తే తెలంగాణ)/ యాదగిరిగుట్ట : ధరణికి దీటుగా కొత్త పోర్టల్ తీసుకొచ్చాం అని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పి జబ్బలు చరుచుకున్నా.. ఇప్పుడా ఆ పోర్టల్‌లోని లొసుగులే ఆసరాగా కేటుగాళ్లు దందాకు తెగబడటం కలకలం రేపుతున్నది. సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఈ-చలానా చెల్లింపు, లావాదేవీలపై తనిఖీ వ్యవ్యస్థ లేకపోవడంతో ఆన్లైన్ సెంటర్లే కేంద్రంగా ప్రభుత్వ ఖజానాకు గండిపడతున్నది. ఐదు రోజుల క్రితం జనగామ తహసీల్దార్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన స్కాంలో ఇప్పటివరకు 4,800డాక్యుమెంట్లపై రూ.48కోట్ల సొమ్ము దారి మళ్లినట్టు అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి రూ.100 కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తున్నది. జనగామలో స్కాం తీగ లాగితే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డొంక కదులుతున్నది. స్కాం ప్రాథమిక సూత్రధారులుగా వెలుగులోకి వచ్చిన యాదగిరిగుట్టకు చెందిన మీసేవ నిర్వాహకుడిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో జనగామలో ముగ్గురు, కొడకండ్లలో ఒకరు, పాలకుర్తిలో మరొకరు, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల, రాజపేటలో కూడా మీ సేవ, నెట్‌బ్యాంకింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
యాదగిరిగుట్ట, కొడకండ్లకు చెందిన మీసేవ, ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకుల లాగిన్ ఐడీ, పాస్వర్డ్తోనే మీ సేవ కేంద్రాలు, నెట్ సెంటర్ల ద్వారా భూ భారతి స్కాట్ల బుకింగ్ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తున్నది. యాదగిరిగుట్టకు చెందిన నిందితుడితో పాటు కొడకండ్ల మీ సేవ నిర్వాహకుడు కూడా ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించిన ట్టు పోలీసులు గుర్తించారు. అసలు మూలాలు కొడకండ్లలో ఉన్నాయా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. కొడకండ్ల మీసేవ నిర్వాహకుడికి అతి సన్నిహితుడిగా ఉన్న ఓ ఐటీ నిపుణుడు సాఫ్ట్వేర్లలో లొసుగులను కనిపెట్టి తన ఆధీనంలోకి తీసుకోవడంలో దిట్టగా పేరుందని తెలిసింది. కొడకండ్ల నుంచే స్లాట్ బుకింగ్ నెట్‌సెంటర్ల నిర్వాహకులతో ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.5వేల చొప్పున కమీషన్ డీల్ మాట్లాడుకొని అమలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, కొన్ని నెలలుగా ఇంత భారీ మొత్తంలో స్కాం జరుగుతున్నా తహసీల్దార్లు గానీ, డీటీవోలు, ఎస్టీవో అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు? ఇందులో ఆయా శాఖల అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అనేది విచారణలో తేలాల్సి ఉంది.
సొమ్ము రికవరీకి ఆదేశాలు..
అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన జిల్లాల్లోని అన్ని మండలాల తహసీల్దార్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అక్రమార్కులు కొల్లగొట్టిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసి లోటును పూడ్చుకునేందుకు భూములు కొనుగోలు చేసిన డాక్యుమెంట్ యజమాని నుంచి డబ్బు రికవరీకి నోటీసులు ఇచ్చింది. అయితే, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి సొమ్ము రాబట్టి లోటును పూడ్చుకోవాల్సింది పోయి.. చెల్లించిన సొమ్మును రెండోసారి చెల్లించాలని కొనుగోలుదారులపై ఒత్తిడి తేవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. జనగామ జిల్లాకేంద్రంలో వెలుగు చూసిన భూ భారతి చలాన్ల స్కాం యాదాద్రి, రంగారెడ్డి, నల్గగొండ, సిద్దిపేట, జనగామ జిల్లాలతోపాటు అక్రమార్కులు తమ నెట్‌వర్క్‌ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా.. దీనికి వెనక అసలు కీలక సూత్రదారి ఎవరన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉన్నది.
స్కాంలకు ఆస్కారం లేకుండా ధరణి
కేసీఆర్ సర్కారు తెచ్చిన ధరణి పోర్టల్‌పై ఈ తరహా స్కాం ఆరోపణలు ఏమీలేవని, డాక్యుమెంట్ల లావాదేవీలన్నీ పక్కాగా పూర్తి పారదర్శకంగా జరిగినట్టు రెవెన్యూ, ఖజానా శాఖల అధికారులే చెబుతున్నారు. కొత్త పోర్టల్ వచ్చిన తర్వాతనే అందులోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు. 2020 నవంబర్ 2నుంచి ధరణిని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అమల్లోకి తీసుకురాగా, టెర్రా ఐసిస్ అనే ప్రైవేట్ సంస్థ దీనిని నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని భూభారతిగా మార్చి నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ)కి అప్పగించింది. ఈ పోర్టల్‌లో ఇప్పటివరకు 50లక్షల లావాదేవీలు జరిగితే.. సాఫ్ట్‌వేర్‌లోని లొసుగులను ఖజానాకు చేరాల్సిన మొత్తంలోంచి 90శాతం గండికొట్టి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.
చెప్పిందొకటి.. జరుగుతున్నది ఇంకోటి!
ధరణికి ధీటైన కొత్త పోర్టల్‌ను తెచ్చామని గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలకు పోర్టల్‌లో లొసుగులను అడ్డంపెట్టుకొని కోట్లు కొల్లగొట్టే వరకు కూడా మేల్కొనకపోవడం గమనార్హం. ఈ పోర్టల్ ద్వారా రైతులు ఎంత చెల్లిస్తున్నారు? రాష్ట్ర ఖజానాకు ఎంత జమ అవుతున్నది? ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయి? అన్నది తనిఖీ చేసే వ్యవస్థ భూ భారతిలో లేదు. ఈ వైఫల్యం ఏడాదిన్నరగా స్కామర్లకు కలిసొచ్చిందని అంటున్నారు. భూ భారతి పోర్టల్‌లో సాగుభూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్‌డీడ్ వంటి లావాదేవీల కోసం రైతులు, కొనుగోలుదారులు ఆన్లైన్ సెంటర్‌కు వచ్చి సర్వేనంబర్ ఆధారంగా భూమి విస్తీర్ణానికి మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తారు.
కొనుగోలుదారులు చెల్లించే పూర్తి సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరకుండా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులు రూ.లక్ష చెల్లిస్తే.. అందులో రూ.10వేలు మాత్రమే ఖజానాకు జమచేసి మిగిలిన రూ.90వేలు వాటాలుగా పంచుకున్నారు. భూ భారతి పోర్టల్ అభాసుపాలై ప్రజల్లో పరువు పోకుండా ఉండేందుకు గుట్టుచప్పుడు కాకుండా భారీ చలాన్ల స్కాంను చిన్నదిగా చూపించేందుకు ప్రభుత్వంలోని పెద్ద తలలు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే తక్కువ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించారనే నెపంతో భూములు కొనుగోలు చేసిన వారి నుంచి లోటు చార్జీలను వసూలు చేసి నష్టనివారణకు పూనుకున్నది.
బస్వరాజే కీలకం!
యాదగిరిగుట్టలో అశోక భూ భారతి రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని నడిపిస్తున్న పన్నీరు బస్వారాజే ఈ స్కాంలో కీలకంగా మారినట్టు తెలుస్తున్నది. అయితే ఈ వ్యవహారానికి హైదరాబాద్‌కు చెందిన మరో కీలక వ్యక్తి మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడని తెలుస్తోంది. బస్వారాజ్ను ఆదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు బయపడుతున్నట్టు తెలిసింది. రాజాపేట మండలం చల్లూరుకు చెందిన గణేశ్, బేంగపేటకు చెందిన పాండు వీరిద్దరు డాక్యుమెంట్లను గౌరాయిపల్లికి చెందిన పన్నీరు బస్వారాజుకు అందజేశారని, వీరి నుంచి పూర్తిస్థాయిలో నగదు తీసుకుని పోర్టల్‌లోని లోసుగులే ఆసరా చేసుకుని, ఎడిట్ ఆప్షన్‌తో పేమెంట్ మొత్తం చేయకుండా 10శాతం మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, మిగతాది స్వాహా చేసినట్టు తేలింది.