జనగామ, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : భూభారతి లావాదేవీల్లో రూ.వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. అసలు రూ. వంద కోట్లా? లేక రూ. వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందా? అనేది రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని అన్నారు. ఈ అక్రమాలకు రెవెన్యూ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోర్టల్‌లో లొసుగులను ఆసరాగా చేసుకొని మీ సేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు కుమ్మకై కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండంగా నడిచిన ధరణి పోర్టల్‌ను రాజకీయ కక్షతో భూభారతిగా మార్చారని దుయ్యబట్టారు. తప్పులతడకగా ఉన్న భూ భారతిని తొలగించి తిరిగి ధరణిని కొనసాగించాలని రైతులు కోరుతున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడుతూ.. భూభారతిలో ఉన్న లొసుగులతో కూడిన పోర్టల్ ద్వారా జరిపిన లావాదేవీలకు సంబంధించిన అక్రమ సొమ్ము మధ్యవర్తుల చేతికి వెళ్తుందా? అధికారుల జేబుల్లోకి వెళ్తుందా? నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.