Farmers | రైతు శ్రీశైలం ఆత్మహత్యకు అప్పులే కారణం.. కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారానికి తెర
Farmers | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని అధికారుల నివేదిక కూడా రూఢీ చేసింది.
- దానికి అనారోగ్య సమస్యలూ తోడయ్యాయి
- సీఎం సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యపై ప్రభుత్వానికి భూత్పూర్ తహసీల్దార్ నివేదిక
- కలెక్టర్ ఆదేశాలతో గ్రామానికి వెళ్లి విచారణ
- 1.15 ఎకరాల్లో పంట ఎండినట్టు నిర్ధారణ
- ‘నమస్తే తెలంగాణ’ కథనమే నిజమని రూఢీ
- కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారానికి తెర
- స్పందించని జిల్లా మంత్రి, ఎమ్మెల్యే
Farmers | మహబూబ్‌నగర్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూత్పూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని అధికారుల నివేదిక కూడా రూఢీ చేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు నడిపిన హైడ్రామాకు తెరపడింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన రైతు శ్రీశైలం అప్పుల బాధతోపాటు అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని భూత్పూర్ తహసీల్దార్ రాజు జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. దీంతో శ్రీశైలం రైతు కాదని, గొర్రెల కాపరి అని, ఆయనకు పొలమే లేదంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు సాగించిన ప్రచారం అబద్ధమని తేలిపోయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఆత్మహత్యపై విచారణ జరిపిన రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు రికార్డులను పరిశీలించి శ్రీశైలం పేరిట 1.15 ఎకరాల భూమి ఉన్నట్టు నిర్ధారించారు. ఆ పొలం నీళ్లు లేక ఎండిపోయిందని, పొలంలో వేసిన బోర్లలో కూడా నీళ్లు రాలేదని, దీంతో అప్పులు పెరిగిపోయాయని నివేదికలో పేర్కొన్నారు.
కండ్ల ముందే పొలం ఎండిపోతుండటం, వేసిన బోర్లల్లో నీళ్లు రాకపోవడంతో మనస్తాపం చెందిన శ్రీశైలం (30) శనివారం సాయంత్రం తన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. సీఎం సొంత జిల్లా కావడంతో ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనన్న భయంతో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఈ ఆత్మహత్యపై భిన్నాభిప్రాయాలు ప్రచారం చేశారు. ‘నమస్తే తెలంగాణ’పై అక్కసు వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి బృందం గ్రామానికి వెళ్లి నిజనిజాలను నిర్ధారించింది. ఒకవైపు భర్త దేహానికి పోస్టుమార్టం జరుగుతుండగా ఆయన భార్య శ్రీశైల.. తన భర్త ఆత్మహత్యకు అప్పులే కారణమని విలపించింది. మరోవైపు, గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఇది ఆత్మహత్య కాదని చెప్పించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో భూత్పూర్ తహసీల్దార్, వ్యవసాయశాఖ అధికారి ఆదివారం సాయంత్రం గ్రామాన్ని సందర్శించి రైతు ఆత్మహత్యకు ప్రధానంగా అప్పులే కారణమని నివేదిక సమర్పించారు.

గొర్రెల కాపరి అంటూ ప్రచారం
మద్దిగట్లలో చనిపోయింది అసలు రైతే కాదని, గొర్రెల కాపరి అంటూ ఇతర మీడియాకు కాంగ్రెస్ నేతలు తప్పుడు సమాచారం అందించారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, పోలీసులకు కూడా ఇదే ఫిర్యాదు అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారని ప్రచారం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డికి చెడ్డపేరు వస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుటుంబాన్ని మేనేజ్ చేయాలంటూ ఒక కాంగ్రెస్ ప్రముఖుడు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే స్థానిక నేతలు ఇలాంటి ప్రచారానికి ఒడిగట్టినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లిన అధికారులను సైతం తప్పుదోవ పట్టించారు. రైతుకు చెందిన పొలాన్ని కాకుండా ఇతరుల పొలాన్ని చూపించి ఇదే పొలం అంటూ నమ్మబలికారు.
స్పందించని మంత్రి, ఎమ్మెల్యేలు
శ్రీశైలం ఆత్మహత్యపై ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కనీసం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. మరోవైపు, రైతు ఆత్మహత్య చేసుకోలేదని స్థానిక కాంగ్రెస్ నేతలతో చెప్పించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కాగా, అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీపీ కదిరే శేఖర్‌రెడ్డి రైతు కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. రూ.5 వేల నగదును మృతుడి భార్యకు అందజేశారు. మృతుడి కుమారుడు గణేశ్‌ను పదో తరగతి వరకు చదివిస్తానని హామీ ఇచ్చారు.
అనాథలైన చిన్నపిల్లలు
మృతుడు శ్రీశైలం కుమారుడు గణేశ్, కూతురు మీనాక్షి ఇద్దరూ చిన్నపిల్లలే. ఆయన భార్య శ్రీశైల ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నది. తన భర్త, తమను అనాథలుగా చేసి వెళ్లిపోతాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అప్పులన్నీ ప్రభుత్వమే చెల్లించాలని, మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. రైతు కుటుంబానికి పక్కా ఇల్లును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

