శ్రీశైలం : శ్రీశైలంలో(Srisailam Temple) సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవాలయంలో వేకువజామున భోగిమంటల(Bhogi mantalu) కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు, మహా మంగళహారతులు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంట చెరుకుతో భోగి మంటలు వేశారు. ప్రధాన ఆలయ మహాద్వారం ముందు గంగాధర మండపం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతకుముందు అర్చకులు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్ది రాజు దంపతులు, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వాహణాధికారి ఐఎస్వి. మోహన్ స్వామి వారి ప్రధానార్చకులు హెచ్ వీరయ్య స్వామి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.