హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తేతెలంగాణ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 21న హోమగుండంలో అగ్నిప్రతిష్ఠాపనతో మొదలైన భవానీదీక్షలు బుధవారం పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. చండీహోమ మందిరంలో పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో దీక్షలు విజయవంతమైనట్టు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 28వ తేదీ నుంచి ఆర్జితసేవలు పునఃప్రారంభవుతాయని చెప్పారు.