హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జల (హైడల్) విద్యుత్తు ఉత్పత్తిని పెంచాలని విద్యుత్తుశాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు. అన్ని ప్లాంట్లల్లో గరిష్ఠ విద్యుత్తు ఉత్పత్తిని సాధించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కృష్ణా, గోదావరి పరివాహకం, ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్తు ఉత్పత్తిని పెంచాలని తెలిపారు.
శనివారం ప్రజాభవన్‌లో థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పత్తి తీరుపై ఆయా శాఖల చీఫ్ ఇంజినీర్లతో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో 17 రోజుల విద్యుత్తు ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. విద్యుత్తు కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలను వారానికోసారి తనకు పంపాలని ఆదేశించారు.
సమస్యలుంటే వెంటనే విద్యుత్తుశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సమాచారాన్ని అందించాలని, సీఈలు నిర్లక్ష్యం వహిస్తే రాతపూర్వక వివరణ తీసుకోవాలని తేల్చిచెప్పారు. సమీక్షలో విద్యుత్తుశాఖ ఇన్చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సల్తానియా, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, ఓఎస్డీ సురేందర్‌రెడ్డి, జెన్కో డైరెక్టర్లు, సీఈలు పాల్గొన్నారు.