హైదరాబాద్: 2025-26 వార్షిక బడ్జెట్ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.1674 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.5734 కోట్ల చొప్పున కేటాయించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇది మూడో బడ్జెట్ ప్రసంగం. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారీ తనంతో సాగుతున్న మా ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి జోడుగుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యామన్నారు. భారతదేశాన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం అమలుచేసే పటిష్ట దేశంగా చూడాలని అంబేద్కర్ నొక్కిచెప్పారన్నారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన నైకిత విలువను పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పారు.