హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆంధ్రజ్యోతి సీఎండీ రాధాకృష్ణతో భేటీ కావడం ‘భట్టి’ సో దరుల మధ్య చిచ్చు పెట్టినట్టు కాంగ్రెస్ వర్గా లు చెప్తున్నాయి. ‘రాధాకృష్ణను ఎందుకు కలిశావు? ఎవరు కలువమన్నారు?’ అంటూ డి ప్యూటీ సీఎం విక్రమార్క తన సోదరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ‘నైని బొగ్గు గని’ కథనంపై తానే రాయబారానికి పంపినట్టు బయట ప్రచారం జరుగుతున్నదని, దీనికి ఏం సమాధానం చెప్తావని మల్లు రవిని నిలదీసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల వాతావరణం నెలకొన్నప్పుడు ఎలా కలుస్తావని ప్రశ్నించినట్టు చెప్పుకొంటున్నారు.
నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో డిప్యూటీ సీఎం విక్రమార్క, రాధాకృష్ణ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెండర్‌కు సంబంధించిన అవకతవకల్లో భట్టి పాత్ర ఉన్నదంటూ రాధాకృష్ణ తన కాలమ్ ‘కొత్తపలుకు’లో ప్రచురించారు. దీనికి సమాధానంగా ఈ కథనం వెనుక ఎవరున్నారో తేలుస్తానని భట్టి హెచ్చరించారు. ఎవరి కండ్లల్లో ఆ నందం చూడాలనుకుంటున్నారంటూ విమర్శలుగుప్పించారు.
ఆ తర్వాత రాధాకృష్ణ రాసిన మరో కథనంలో మరోసారి భట్టిని ఉద్దేశించి మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితు ల్లో ఎంపీ మల్లు రవి ఆదివారం రాధాకృష్ణతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు ఈ భేటీ జరిగింది. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా మీడియా, రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో అ పోహలు, విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్న పరిస్థితుల్లో వాటిపై చర్చించేందు కు రాధాకృష్ణతో భేటీ అయినట్టు తెలిపారు.
మల్లు రవి, రాధాకృష్ణ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. భట్టి, రాధాకృష్ణ మధ్య వైరం నేపథ్యంలో రవి ఎందుకు సమావేశమయ్యారనే చర్చ జరుగుతున్నది. తన సోదరుడి తరఫున వకాల్తా పుచ్చుకొని రాధాకృష్ణతో భేటీ అయ్యారా? ఇద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేశారా? అనే ప్రశ్న లు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భేటీపై భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహంతో ఉన్న ట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఎవరి అనుమతి తీసుకొని, ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి కోసం భేటీ అయ్యావో చెప్పాలని మల్లు రవిని భట్టి నిలదీసినట్టు గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది. వేళ్లన్నీ తనవైపే చూపిస్తున్నాయని, తానే రాయబారానికో, రాజీకోసమో పంపిన ట్టు ప్రచారం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ముందూ వెనుక ఆలోచించకుండా ఇలాంటివి ఎందుకు చేశావంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
భట్టి నిలదీసిన సమయంలో సంచలన విషయం బయటపడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేత ఆదేశాల మేరకే మల్లు రవి రాధాకృష్ణతో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతున్నది. మల్లు రవికి రాధాకృష్ణ అంత సమయం ఇవ్వడం, ప్రత్యేకంగా భేటీ కావడం ఇందుకు బలం చేకూర్చుతున్నదని చెప్తున్నారు. ఈ సమావేశం ద్వారా భట్టిని మరింత ఇరకాటంలో పడేయాలని ముఖ్యనేత ప్లాన్ చేసినట్టు చెప్పకొంటున్నారు. ఈ విషయం తెలియక ఆదేశాలు రావడమే ఆలస్యమన్నట్టు రాధాకృష్ణతో భేటీకి మల్లు రవి పరుగులు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం అటు భట్టి విక్రమార్కను ఇబ్బందిపెట్టడంతోపాటు ఇటు సోదరుల మధ్య చిచ్చు పెట్టిందని గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది.